కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం | Fire Accident In Katedan | Sakshi
Sakshi News home page

కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం

Published Mon, Apr 2 2018 10:55 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Fire Accident In Katedan - Sakshi

ఎగిసిపడుతున్న మంటలు 

రాజేంద్రనగర్‌: కాటేదాన్‌లోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడు గంటల పాటు మంటలు ఎగిసిపడి షేడ్‌ మొత్తం దగ్ధమైంది. పక్కనే ఉన్న పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ప్రజలు తీవ్రంగా కష్టపడ్డారు. ఇంత జరిగిన నిర్వాహకులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోగా సమాచారం సైతం అందించలేదు. స్థానికులు, కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం..  కాటేదాన్‌ పారిశ్రామికవాడలో షాలీమార్‌ కొబ్బరినూనె పరిశ్రమ కొనసాగుతుంది. ఇందులో నూనె తయారీ, ప్యాకింగ్‌ చేస్తారు.
శనివారం రాత్రి విధులు ముగించుకున్న కార్మికులు ఇళ్లకు వెళ్లారు. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. మంటలు ఉధృతం కావడంతో సెక్యూరిటీ గార్డులు విషయాన్ని కంపెనీ యజమానికి తెలిపారు. అప్పటికే పరిశ్రమలోని నాలుగువైపుల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. నిమిషాల వ్యవధిలో దట్టమైన పొగలతో ప్యాకింగ్‌కు సిద్ధంగా ఉన్న కొబ్బరినూనె డబ్బాలు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్తి నష్టం కోట్లల్లో ఉంటుందని కార్మికులు తెలుపుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే పరిశ్రమ పైకప్పు కుప్పకూలింది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని దీంతో కేసు నమోదు చేయలేదని మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర జగదీశ్వర్‌ తెలిపారు.  
ఆదివారం కావడంతో... 
ఈ పరిశ్రమలో కొబ్బరినూనె తయారీ, ప్యాకింగ్‌తో పాటు పసుపు, కారం, గరం మసాలా తది తర నిత్యవసర వస్తువుల ప్యాకింగ్‌ను నిర్వహి స్తున్నారు. ఇందులో 800 మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఆదివారం ఉదయం ప్రమాదం జరగడంతో ఎవరు లేరని దీని కారణంగా పెను ప్రమాదం తప్పిందని కార్మికులు వెల్లడించారు.  
రెండు గంటలు ఉక్కిరిబిక్కిరి... 
ఉదయం రెండు గంటల పాటు దట్టమైన పొగలతో కాటేదాన్‌ పరిశ్రమ చుట్టుపక్కల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు పొగ కమ్మేసింది. ఫైర్‌ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాటేదాన్‌ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న ప్రతిసారి అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానికంగా వాహనాలు వెళ్ళేందుకు రహదారులు పెద్దగా లేకపోవడం, రహదారి నుంచి పరిశ్రమ లోపలికి ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు అగ్నిమాపక యంత్రంలో నీటిని తిరిగి తీసుకురావడానికి బుద్వేల్‌ లేదా బహదూర్‌పురా వాటర్‌బిడ్‌ల వద్దకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement