సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: నగరంలో ఓ చేపల వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. శనివారం జవహర్‌నగర్‌లోని గదికి పిలిపించి చంపేసిన దుండగులు ఆపై కుటుంబీకులను వాట్సాప్ ద్వారా డబ్బు డిమాండ్ చేశారు. అంతం చేయడానికి ముందు చిత్రహింసలకు గురి చేశారని, ఓ చెయ్యి కూడా నరికేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రధాన అనుమానితుడిగా చేర్చిన పోలీసులు పరారీలో ఉన్న అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది. ఏజీ కాలనీ సమీపంలోని వికాస్‌పురి కాలనీలో నివసించే పి.రమేష్ (50) కళ్యాణ్‌నగర్ జీటీఎస్ కాలని దేవాలయం సమీపంలో చేపల వ్యాపారం చేస్తుంటాడు. హోల్‌సేల్‌గా చేపల్ని ఖరీదు చేసుకువచ్చి రిటైల్‌గా విక్రయిస్తుంటాడు. ఇందులో ఇతడి ముగ్గురు కుమారులు సైతం సహకరిస్తుంటారు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రమేష్‌కు రెండు ఫోన్‌కాల్స్ వచ్చాయి. కుటుంబీకుల నుంచి దూరంగా వెళ్లి వీటిని మాట్లాడిన ఆయన బోరబండలో ఉండే తన స్నేహితుడు యూసుఫ్‌ని కలిసి వస్తానంటూ చెప్పి 6.30 గంటలకు తన స్కూటీ వాహనంపై బయటకు వెళ్ళారు. ఆ రోజు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రమేష్ కుమారుడైన ప్రదీప్ స్నేహితుడు సాయి తన ఫోన్ నుంచి రమేష్‌కు కాల్ చేశాడు.
ఈ సందర్భంలో తాను తన స్నేహితుడి ఇంట్లో ఉన్నానని, నిన్ను తర్వాత కలుస్తానంటూ చెప్పిన రమేష్ ఫోన్ పెట్టేశాడు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రమేష్ సెల్‌ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా ఆయన కోడలు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబీకులు కాల్ చేయగా... ఫోన్ స్విచ్ఛాప్ చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన రమేష్ కుటుంబీకులు ఆయన ఆచూకీ కోసం అనేక ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీయడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా... సోమవారం నుంచి హతుడి ఫోన్ నుంచే వాట్సాప్ ద్వారా కుటుంబీకులకు సందేశాలు రావడం మొదలైంది. వీటిలో తాము రమేష్‌ను కిడ్నాప్ చేశామని, రూ.90 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఓ సందేశం పంపిన వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. దీంతో ఆచూకీ కనిపెట్టడం కష్టసాధ్యంగా మారింది. మంగళవారం ఉదయం 10 గంటలకూ డబ్బు సిద్ధమైందా? అంటూ సందేశం వచ్చింది. సాయంత్రం 4 గంటలకు మరోసారి సందేశం రాగా... ఇప్పటికి రూ.10 లక్షలు సిద్ధమయ్యాయని, మిగిలిని మొత్తం కోసం ప్రయత్నిస్తున్నామని కుటుంబీకులతో పోలీసులు రిప్‌లై ఇప్పించారు.
ఓపక్క ఈ సంప్రదింపులు కొనసాగుతుండగా... రమేష్ కిడ్నాప్ అయి ఉంటాడని భావించిన పోలీసులు అతడి ఆచూకీ కనిపెట్టడానికి అనేక ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా... జీటీఎస్ కాలనీ దేవాలయం వెనుక వైపు ఉన్న ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా... కాళ్ళు, చేయి కట్టేసి గన్నీ బ్యాగ్‌లో మూటకట్టిన శవం బయటపడింది. పక్కనే మరో సంచిలో మృతదేహానికి సంబంధించి చెయ్యి ఉంది. చిత్రహింలకు గురి చేసి, చెయ్యి నరికి, చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మృతదేహం ఎవరిదని ఆరా తీయగా... ఎస్సార్‌నగర్‌లో మిస్సింగ్ కేసు నమోదైన రమేష్‌కు చెందినదిగా తేలింది. మృతదేహం స్థితిని బట్టి శనివారమే హత్య చేసినట్లు నిర్థారిస్తున్నారు. రమేష్‌ను చంపేసిన తర్వాత అతడి కుటుంబీకుల్ని డబ్బు డిమాండ్ చేసినట్లు అధికారులు తేల్చారు. హంతకుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు మృతదేహం లభించిన గదిని 15 రోజుల క్రితం అద్దెకు తీసుకున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రధాన అనుమానితుడిగా చేర్చారు. అతడు భార్య, ఇద్దరు పిల్లలతో వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. సోమవారం ఇంటి యజమానికి అద్దె చెల్లించిన అతడు ఆపై కుటుంబంతో సహా ఆచూకీ లేకుండా పోయాడు. ఇతడి ఫోన్ నెంబర్ సహా ఇతర వివరాలు ఇంటి యజమాని వద్ద లేకపోవడంతో దర్యాప్తు కష్టసాధ్యంగా మారింది. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు రమేష్ మాట్లాడిన ఫోన్ నెంబర్ యూసుఫ్‌గూడకు చెందిన రమణమ్మ పేరుతో ఉన్నట్లు తేలింది. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రమేష్ మిస్సింగ్‌కు సంబంధించి అతడి కుమారుడు ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదును ఎస్సార్‌నగర్ పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని, పక్కాగా విచారణ చేయలేదని తెలుస్తోంది.
పరిచయస్తుడే హంతకుడు..?
చేపల వ్యాపారి రమేష్‌ను హత్య చేసింది అతడి పరిచయస్తుడే అని పోలీసులు నిర్థారించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ఇతగాడు కొన్నేళ్ల క్రితం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చాడు. ముషీరాబాద్ చేపల మార్కెట్ సమీపంలో ఉంటున్న నేపథ్యంలో అతనికి చేపల వ్యాపారి రమేష్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో కొన్నాళ్ల పాటు రమేష్ ఇంట్లోనే అద్దెకు ఉన్నాడు. ఇటీవల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇతగాడు రమేష్ ఆర్థిక స్థితి తెలిసిన నేపథ్యంలో అతడ్ని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని పథకం వేశాడని తెలిసింది. దీంతో ప్లాన్ ప్రకారమే జవహర్‌నగర్‌లో శ్రీనివాస్ పేరుతో ఇంటిని అద్దెకు తీసుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. మంగళవారం ఉదయం 10.30 గంటల వరకు కుటుంబంతోనే ఉండి, ఆపై అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సదరు పరిచయస్తుడి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. అతడి కుటుంబీకుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment