వివరాలు వెల్లడిస్తున్న సీఐ రామకృష్ణారెడ్డి, చిత్రంలో ఎస్సైలు, సిబ్బంది
గూడూరు: మతిస్థిమితం లేని యువతిపై లైంగికదాడికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన ఐదుగురు మృగాళ్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ కె.రామకృష్ణారెడ్డి రూరల్, చిల్లకూరు ఎస్సైలతో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గూడూరు రూరల్‌కి చెందిన మతిస్థిమితం లేని యువతి (30) ఈనెల 5వ తేదీ రాత్రి దోసెపిండి తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆమె ఉంటున్న ప్రాంతానికి చెందిన సాయి శివకుమార్ అలియాస్ సాయి (20), వెంకటేష్ (24), శరత్, వినోద్ (22), లక్ష్మయ్య (26) ఫూటుగా మద్యం సేవించి ఆ యువతి ఇంటి సమీపంలో ఉన్నారు. యువతి కాసేపటికి దోసెపిండి తీసుకుని తిరిగి వెళ్తుండగా సాయి శివకుమార్ ఆమెతో మాట్లాడాడు. ఓ మహిళ ఇంట్లో కుక్క పిల్ల ఉందని, అది ఇస్తామని మాయమాటలు చెప్పి యువతిని సమీపంలోని పాడుబడిన ఇంటికి తీసుకెళ్లాడు. ఈక్రమంలో ఐదుగురు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. యువతి ప్రతిఘటించగా తలపై రాయితో కొట్టి, బ్లేడుతో ఆమె శరీరంపై కోసి హత్య చేశారు. ఆమె మృతిచెందిన తర్వాత పరారయ్యారు.
ఇలా గుర్తించారు
దోసెపిండి కోసం వెళ్లిన యువతి ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెంది ఆ ప్రాంతమంతా వెతికారు. అయితే ఆచూకీ తెలియలేదు. మరుసటిరోజున స్థానికులు పాడుబడిన ఇంట్లో యువతి మృతదేహాన్ని గుర్తించి ఆమె కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, గూడూరు రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలను సేకరించారు. యువతి శరీరంపై సర్జికల్ బ్లేడ్‌తో కోసి ఉండడాన్ని గుర్తించారు. మొదటి ముద్దాయి అయిన సాయి గతంలో సర్జికల్ బ్లేడ్‌తో ఓ హత్య చేశాడు. అతనే యువతిని హత్య చేసి ఉంటాడని భావించి ఆ దిశగా విచారించారు. బుధవారం సాయంత్రం కొండాగుంట రైల్వేస్టేషన్‌లో నిందితులు ఉన్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఐదుగురూ తామే లైంగికదాడికి పాల్పడి హత్య చేశామని అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేశారు. నిందితులపై దిశ చట్టం కింద కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించేందుకు కృషి చేసిన ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్.మక్బూల్, రూరల్ సీఐ కె.రామకృష్ణారెడ్డి, రూరల్, చిల్లకూరు ఎస్సైలు పుల్లారావు, హుస్సేన్‌బాషా, హెడ్ కానిస్టేబుళ్లు ఆర్‌వీ రాజు, ఓవీ చిరంజీవులు, కె.నావూరయ్య, ఈ.శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు పి.ఆదినారాయణ, పి.మాధవరావు, కె.నాగేంద్ర, జి.శ్రీనివాసులును పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. కాగా గతంలో ప్రధాన ముద్దాయి సాయి గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండగా రిమాండ్ నుంచి పరారయ్యాడు. అతనిపై రౌడీషీట్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment