సాక్షి, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బయటపడ్డ ఐదు మృతదేహాల సంఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో రెండు మృతదేహాలు, మరో ముగ్గురి మృతదేహాలు రోడ్డు పక్కన లభించిన విషయం తెలిసిందే. అయితే వారంతా ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హత్యకు పాల్పడ్డారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా మృతుల్లో రెండు కుటుంబాలకు చెందినవారు ఉన్నారు.
అమీన్‌పూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి భార్య లక్ష్మి, కూతురు సింధూజతోపాటు.... లక్ష్మీ సోదరి కుమారుడు ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య మాధవి, కుమారుడు వర్షిత్‌గా గుర్తించారు. (కారులో ఉన్న మృతదేహాలు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు వర్షిత్) కాగా రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కలిసి స్టాక్ మార్కెట్ బిజినెస్ చేసేవారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని రవీందర్ రెడ్డి చెబుతున్నారు. తమకు ఎవరూ శత్రువులు లేరని, ఎవరిపైనా అనుమానాలు లేవన్నారు. వీరంతా రెండు రోజుల క్రితం ప్రాజెక్ట్ చూసి వస్తామని వెళ్లారని, కాగా మొన్న సాయంత్రం తిరిగి వస్తున్నామని తెలిపారు. అంతలోనే ఏం జరిగిందో ఏమో ... ఫోన్‌లన్నీ స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో రెండ్రోజుల క్రితమే వారు మిస్సైనట్లు ఇంటి యాజమాని రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గంటలో ఇంటికి వస్తామన్నారు...
గంట లోపు ఇంటికి వస్తున్నామని చెప్పి... తిరిగిరాని లోకాలకు వెళ్లారంటూ మృతుడు ప్రభాకర్‌రెడ్డి సోదరుడు దినేశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఏం జరిగిందో తెలియడం లేదని కన్నీరుమున్నీరయ్యాడు. బయటకు వెళుతున్నామని.. ఇంటి తాళాలు అక్కడే ఉన్నాయని చెప్పారన్నారు. సాయంత్రానికి ఫోన్‌లన్నీ స్వీచ్ ఆఫ్ వచ్చాయని ఏం జరిగిందో అంతుచిక్కడం లేదని దినేశ్‌రెడ్డి బోరున విలపిస్తున్నాడు
కారులో పాయిజన్ వాసన ...
మరోవైపు సీపీ సందీప్ శాండిల్య... సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, ఆత్మహత్యా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు. కారులో పాయిజన్ వాసన వస్తోందని, పోస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని సీపీ పేర్కొన్నారు. అలాగే కారులో పురుగుల మందు ఉన్న రెండు బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment