ఓటమి భయంతో టీడీపీ అడ్డదారులు | Kovuru YSRCP candidate brother is offered Rs 3 crore: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతో టీడీపీ అడ్డదారులు

Published Tue, Apr 9 2024 5:39 AM | Last Updated on Tue, Apr 9 2024 10:53 AM

Kovuru YSRCP candidate brother is offered Rs 3 crore: Andhra pradesh - Sakshi

ప్యాకేజీలతో ఆయారాం గయారాంలకు వల 

కోవూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సోదరుడికే రూ.3 కోట్ల ఆఫర్‌ 

రంగంలోకి దిగిన ‘వేమిరెడ్డి’ టీమ్‌

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్‌ రోజురోజుకూ దిగజారిపోతుండడంతో ఓటమి భయం పట్టుకున్న ఆ పార్టీ అభ్యర్థులు చివరికి అడ్డదారులు ఎంచుకున్నారు. ఆయారాం, గయారాంలను గుర్తించి ప్యాకేజీ ఆఫర్లతో వారిని కొనుగోలు చేసేందుకు ప్రలో­భాలకు గురిచేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేసి ఆ పార్టీ ఓడిపోయాక అధికారం కోసం వైఎస్సార్‌సీపీ చెంత చేరిన నేతలే ఇప్పుడు టీడీపీ నేతల ప్యాకేజీలకు కక్కుర్తిపడుతున్నారు. నిఖార్‌సైన వైఎస్సార్‌సీపీ నేతలు మాత్రం వారిచ్చే ప్యాకేజీలకు లొంగకుండా పార్టీ కోసం కష్టపడుతున్నారు.

ఇక టీడీపీ నేతల బరితెగింపును చూస్తున్న ఓటర్లు మాత్రం వారిని ఛీదరించుకుంటున్నారు. తాజాగా.. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏకంగా కోవూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు రూ.3 కోట్లు ఆఫర్‌ ఇవ్వడం బట్టబయలు కావడంతో టీడీపీ అభ్యర్థుల బాగోతం వెలుగులోకి వచ్చింది. నిజానికి.. వేమిరెడ్డి దంపతులు ఓట్ల కొనుగోలుకు నోట్ల కట్టలను విచ్చలవిడిగా విసురుతున్నారు. గంపగుత్తగా ఓట్లు కొనుగోలు చేసేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు భారీ మొత్తంలో ఎరవేస్తున్నారు.

ఇటీవల కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం కృష్ణాపురంలో మత్స్యకార గ్రామాల్లో దురాయి ఆచారాన్ని అడ్డం పెట్టుకుని ఓట్ల కొనేందుకు రూ.80 లక్షలకు బేరం పెట్టిన విషయం బయటకు పొక్కింది. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం నిఘా ఉంచడంతో వీరు తాజాగా ప్రజాప్రతినిధులపై దృష్టిసారించారు. 

ప్రజాప్రతినిధులకు ప్యాకేజీలు.. 
ఇక నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను టార్గెట్‌ చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తునారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు స్థానిక లీడర్లకు రూ.15 లక్షలు.. ఎంపీపీలు, జెడ్పీటీసీలకు రూ.25 లక్షల చొప్పున రేటు ఫిక్స్‌ చేశారు. వీరి పరిధిలో ఓట్లు వేయించే బాధ్యత మీదే అంటూ టార్గెట్లు పెడుతున్నారు. అలాగే, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కందుకూరు నియోజకవర్గాలతో పాటు తన సతీమణి పోటీచేస్తున్న కోవూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు రేట్లు ఫిక్స్‌చేసి ప్రలోభాలకు గురిచేయడం వెలుగులోకి వచ్చాయి.

ప్రధానంగా కోవూరు నియోజకవర్గంలో ఆయారాం, గయారాంలను ఒకొక్కరిని రహస్యంగా తమ శిబిరాలకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. బుచి్చరెడ్డిపాళెం మండలంలోని వవ్వేరు బ్యాంకు చైర్మన్‌లుగా పనిచేసిన ఇద్దరు నేతలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. వారిలో ఒకరు గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేసిన నేత కావడం గమనార్హం. ఎన్నికల వేళ ప్యాకేజీ ఆఫర్‌ పెంచుకుని తిరిగి సొంత పార్టీలోకి మారారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. అలాగే, జొన్నవాడ ఆలయ మాజీ చైర్మన్‌ కూడా ఇదే తరహా ప్యాకేజీలతో పార్టీ ఫిరాయించారని చెబుతున్నారు.

నేతలకు ప్యాకేజీలతో పాటు ఓటర్లకు సైతం భారీగానే డబ్బులిస్తామని, ఆ డబ్బుల పంపిణీ బాధ్యత కూడా మీదే అని ఆశపెట్టి మరీ పార్టీ కండువా కప్పుతున్నారు. ఇలా ప్రజాప్రతినిధులతో పాటు ఆయా గ్రామాల్లో బలమైన నేతలకు సైతం ప్యాకేజీలు అందించేందుకు వేమిరెడ్డి తన బంధుగణంతో ఏర్పాటుచేసుకున్న టీమ్‌తో వ్యవహారాలు నడిపిస్తున్నారు. 

రివర్స్‌ అవుతున్న ఓటర్లు.. 
కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి దంపతులు మండల స్థాయి నేతలకు రూ.కోట్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రూ.లక్షల్లో ప్యాకేజీలు ఇస్తు­న్నారు. ప్యాకేజీలు తీసుకున్న వారు ఈ దఫా ఎన్నికల్లో  ప్రశాంతిరెడ్డికి ఓట్లు వేద్దామని స్థానికులకు చెబుతుండడంతో ‘ఎంత డబ్బులు తీసుకున్నారు వాళ్ల దగ్గర’.. అంటూ భగ్గుమంటున్నారు.   త­మకు సీఎం జగన్‌  రూ.లక్షల్లో సాయం అందించా­రని, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్లకు ఓటేసి ఆయన­కు ద్రోహం చేయలేమని ఓటర్లు తెగేసి చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement