పాతబస్తీలో బందిపోట్ల బీభత్సం | Five Kg Gold Theft in Jewellery Kharkana | Sakshi
Sakshi News home page

కట్టేసి కొట్టేశారు..

Published Wed, Mar 7 2018 1:23 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Five Kg Gold Theft in Jewellery Kharkana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :
మంగళవారం మధ్యాహ్నం
ఒంటి గంట సమయం..
అత్యంత రద్దీగా ఉండే పాతబస్తీ ప్రాంతం
హైకోర్టుకు కూతవేటు దూరం..
నగర పోలీసు సాయుధ దళం
ప్రధాన కార్యాలయం వెనుక ప్రదేశం..
ఉన్నట్టుండి 10 మంది దొంగలు
జ్యువెలరీ కార్ఖానాపై దాడి చేశారు.
కత్తులు, తుపాకులతో బెదిరించి
మేనేజర్‌ను, సిబ్బందిని బంధించారు.
బట్వాడాకు సిద్ధంగా ఉన్న
ఐదు కేజీల బంగారు ఆభరణాలు
తీసుకుని ఉడాయించారు.
పోతూపోతూ సీసీ కెమెరాల దృశ్యాలు
రికార్డయ్యే డిజిటల్‌ వీడియో రికార్డర్‌
(డీవీఆర్‌) సైతం పట్టుకుపోయారు.

కార్ఖానాలో అణువణువూ పరిచయం ఉన్న వారే ఈ దొంగతనంలో పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ బందిపోటు దొంగతనం నేపథ్యంలో ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

అంతా పశ్చిమబెంగాల్‌ వారే..
పశ్చిమబెంగాల్‌కు చెందిన నిత్యాదాస్‌ బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ముంబైలోని ప్రధాన కార్యాలయంలో ఓ కార్ఖానా ఉండగా, పాతబస్తీలోని పేట్లబురుజు సమీపంలో నగర పోలీసు సాయుధ దళం ప్రధాన కార్యాలయం(సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌) వెనుక వైపు ఉన్న షేర్‌ అలీ తబేలాలోని ముజీబ్‌ అనే వ్యక్తి ఇంట్లో మరో కార్ఖానా నడుస్తోంది. మూడంతస్తుల భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆరేళ్లుగా నడుస్తున్న ఈ కార్ఖానాలో పశ్చిమబెంగాల్‌కు చెందిన అనేక మంది పనిచేస్తున్నారు. కొందరు మానేస్తుండగా ఎప్పటికప్పుడు కొత్త వారు చేరుతున్నారు.

నిత్యాదాస్‌ ఇటీవల ముంబై వెళ్లగా మేనేజర్‌గా ఉన్న ఆయన మేనల్లుడు సాహేబ్‌దాస్‌ పనులు పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 8 నుంచి 10 మంది దుండగులు ఒక్కసారిగా ఆ కార్యాలయంలోకి చొరబడ్డారు. లోపలి వైపు నుంచి తలుపులు బిగించి బోల్టులు పెట్టారు. కత్తులు, కర్రలతో భయపెడుతూ సాహేబ్‌తో పాటు ఆ సమయంలో పనిచేస్తున్న 20 మంది కార్మికుల్ని ఓ చోటుకు చేర్చారు.

వారి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి దాడికి పాల్పడ్డారు. అరిస్తే చంపేస్తామని బెదిరించి ఓ రూమ్‌లో అందరినీ బంధించారు. కార్ఖానాలో ఉన్న 5 కేజీల బంగారాన్ని ఓ బ్యాగ్‌లో నింపుకుని పరారయ్యారు. దుండగులు వెళ్తూవెళ్తూ సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్‌ సైతం పట్టుకుపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న సాహేబ్‌ మిత్రులు, బంధువులతో పాటు పోలీసులకూ సమాచారం ఇచ్చాడు.

తెలిసిన వారి పనేనా..?
బందిపోటు దొంగతనానికి ఒడిగట్టిన దుండగులు కార్ఖానాలో అణువణువూ తమకు తెలిసినట్లు వ్యవహరించారు. బయటకు ఎవరికీ కనిపించని ఓ చిన్న బీరువా విషయాన్నీ వీరు కార్మికులతో ప్రస్తావించారు. అదే గదిలో బందీగా ఉన్న ఓ కార్మికుడు ఆ బీరువాలో ఏం లేదని చెప్పినా వినిపించుకోని దుండగులు.. ఆభరణాలు ఉంటాయని తెరవాలంటూ బెదిరించారు.

దీంతో కార్మికులు దాన్ని తెరవగా అందులో ఉన్న 1,100 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నారు. మరోవైపు కార్ఖానాలోకి రావడానికి గేటు ఎదురుగా ఉన్న ప్రధాన ద్వారం వినియోగించిన వీరు.. తిరిగి వెళ్లడానికి మాత్రం పక్కనే ఉన్న కనెక్టింగ్‌ రోడ్‌ వాడారు. కార్ఖానా వద్దకు చేరుకునే విషయంలోనూ దుండగులు తెలివిగా వ్యవహరించారు. పది మందీ కలసి వస్తే ఎవరైనా గమనించే ఆస్కారం ఉందనే ఉద్దేశంతో వేర్వేరు మార్గాల్లో ఎవరికి వారుగా పేట్లబురుజు చౌరస్తాకు చేరుకున్నారు.

అక్కడ నుంచి కార్ఖానా సమీప ప్రాంతంలోకి నడుచుకుంటూ వెళ్లి దాదాపు గంటన్నర పాటు విడివిడిగా వేచి ఉన్నారు. నేరం చేసిన తర్వాత సైతం వచ్చిన మార్గంలో కాకుండా ఫిర్దోష్‌ స్కూల్‌ వైపు వెళ్లారు. దొంగతనం పూర్తయిన తర్వాత సమాచారం అందుకున్న ముగ్గురు దుండగులు ద్విచక్ర వాహనాలు తీసుకురాగా.. వాటిపై ఆరుగురు సొత్తుతో పారిపోయారు. మిగిలిన వారు నెమ్మదిగా జనాల్లో కలసి కనుమరుగయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న చార్మినార్‌ పోలీసులు డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల్ని రప్పించారు.

ఎక్కడా కనిపించని ‘ప్రతిఘటన’
ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ బందిపోటు దొంగతనంలో పది నుంచి 12 మంది పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు ద్విచక్ర వాహనాలతో సమీపంలోనే వేచి చూడగా.. మిగిలిన వారు కార్ఖానాలోకి ప్రవేశించారు. ఆ సమయంలో కార్ఖానాలో ఉన్న 20 మంది కార్మికులు ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదని పోలీసులు చెప్తున్నారు. వీరు ప్రతిఘటించినా, కాస్త «ధైర్యం చేసి అప్రమత్తం చేసినా సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో శిక్షణ నిమిత్తం గ్రౌండ్స్‌లో ఉన్న దాదాపు 200 మంది పోలీసులు అప్రమత్తమయ్యేవారు. దీనికితోడు బందిపోటు దొంగలు తమకు కార్ఖానాలో ప్రతి అణువూ తెలిసినట్లు ప్రవర్తించారు.

వీటిని బేరీజు వేస్తున్న పోలీసులు ఆ కార్ఖానాకు చెందిన ప్రస్తుత–పాత కార్మికులు కలసి ఈ దొంగతనం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని ముంబైలో ఉన్న నిత్యాదాస్‌ వద్ద ప్రస్తావించగా.. అనుమానితులుగా పరిగణించే ఆరుగురి పేర్లు చెప్పారు. దీంతో పోలీసులు కొందరు ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బందిపోటు దొంగలు తమ వెంట తుపాకీ తీసుకువచ్చారని, ఓ రౌండ్‌ కాల్పులు జరిపారని స్థానికులు చెప్తున్నారు. తుపాకీ చూపించిన నేపథ్యంలోనే కార్మికులు ప్రతిఘటించలేదని తెలుస్తోంది. అయితే దుండగులు తుపాకీ వినియోగించారనే అంశాన్ని పోలీసులు కొట్టిపారేస్తున్నారు.

స్కూల్‌ వద్ద ఆగిపోయిన జాగీలం..
ఘటనాస్థలికి వచ్చిన పోలీసు జాగీలాలు కార్ఖానాలో 15 నిమిషాలు కలియతిరిగాయి. ఆపై ముందు ఉన్న ప్రధాన రహదారి వైపు కాకుండా చార్‌ మహల్‌ మీదుగా పురానాపూల్‌ వెళ్లే దారిలోకి వెళ్లాయి. అక్కడ నుంచి ఓ గల్లీలోని ఫిర్దోస్‌ స్కూల్‌ వద్దకు వెళ్లి ఆగిపోయాయి. కొద్దిసేపు అక్కడే ఉన్న జాగీలం తిరిగి కార్ఖానా వద్దకే వచ్చింది. దీన్నిబట్టి దుండగులు ఫిర్దోష్‌ స్కూల్‌ మీదుగా పురానాపూల్‌ వైపు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉదంతం జరిగిన సమయంలో కార్ఖానాలో ఉన్న కార్మికులతో పాటు మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పురానాపూల్, పేట్లబురుజుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేస్తున్నారు. ఈ కార్ఖానాకు 150 మీటర్ల దూరంలో పురానాపూల్‌ వైపు ఉన్న ఓ సీసీ కెమెరాలో దుండగులు వినియోగించిన ద్విచక్ర వాహనం ఆనవాళ్లు రికార్డు అయినట్లు తెలిసింది. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్తున్నారు.

సరైన భద్రతా చర్యలు లేవన్న డీసీపీ..
బందిపోటు దొంగతనం జరిగిన ప్రాంతాన్ని దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ పరిశీలించారు. ఈ ఉదంతంలో ఎక్కడా కాల్పులు జరిగిన ఆనవాళ్లు లేవని, ఎవరికీ గాయాలు కాలేదని వివరించారు. ప్రస్తుత–మాజీ సిబ్బంది పాత్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ముంబై నుంచి నిత్యాదాస్‌ వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు.

దర్యాప్తు కోసం ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు. కేజీల బంగారంతో ఆభరణాలు తయారు చేసే ఈ కార్ఖానాలో సీసీ కెమెరాలు మినహా ఎలాంటి భద్రతా చర్యలు లేవని చెప్పారు. పాతబస్తీలో ఇలాంటి కార్ఖానాలు 600 వరకు ఉన్నాయని, కార్మికులుగా పశ్చిమ బెంగాల్‌ సహా బయటి వారే ఉంటున్నారని, భద్రతాంశాలకు సంబంధించిన వీటికి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement