
సాక్షి, తుమకూరు : కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా దేవుడి దర్శనం కోసం వెళుతుండగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులలో ఇద‍్దరు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకాలో ఉన్న గవిమఠం సమిపంలో సోమవారం చోటు చేసుకుంది. చౌడనకుప్పె గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఐదేళ‍్లుగా మండ‍్య నగరంలో నివాసం ఉంటున్నారు. వారు కొత‍్త కారు కొనుగోలుచేశారు. నూతన సంవత‍్సరం సందర‍్బంగా దైవ దర‍్శనంతో పాటు కారుకు పూజ చేయించేందుకు సోమవారం ఉదయం కొరటిగెరె తాలూకాలో ఉన‍్న గురవనహళ్ళిలోని మహాలక్ష్మి ఆలయానికి వెళుతుండగా ఈ దుర‍్ఘటన జరిగింది.
గవిమఠం సమీపంలో రోడ్డుపై చిన‍్నపాప అడ‍్డంగా రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దాంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన‍్న సిద్దూజీరావు(60), ఉషాబాయి(35) కీర్తన(7) హితేష్(3) భువన(16) అక‍్కడికక‍్కడే మృతిచెందారు. హరీష్‌రావు, సతీష్, నవీన్, అశ్విని తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను బెంగుళూరు ఆస‍్పత్రికి తరలించారు. సమాచారం అందుకున‍్న కుణిగల్ ఎస్‌ఐ పుట్టెగౌడ, పోలీసు సిబ్బంది సంఘటన స‍్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో కారుకు అడ‍్డంగా వచ్చిన చిన్నారి కూడా తీవ్రంగా గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment