నిర్లక్ష్యం ఖరీదు.. రెండు ప్రాణాలు | Former Soldiers Died In Electrocution | Sakshi
Sakshi News home page

కాటేసిన నిర్లక్ష్యం

Published Tue, Jun 18 2019 7:27 AM | Last Updated on Wed, Jun 19 2019 8:24 AM

Former Soldiers Killed In Electrocution - Sakshi

సాక్షి, పులివెందుల : విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆర్మీలో పనిచేసి దేశానికి సేవ చేసిన ఇద్దరు స్నేహితులు తుదకు మృత్యుఒడికి కూడా కలిసే చేరుకున్నారు. వివరాలలోకి వెళితే లింగాల మండలం గుణకణపల్లెకి చెందిన ప్రతాప్‌రెడ్డి(36), వేముల మండలం నల్లచెరువుపల్లెకు చెందిన రామిరెడ్డి గోవర్దన్‌రెడ్డి(35)లు కొంతకాలం ఆర్మీలో పనిచేశారు. తర్వాత రిజైన్‌ చేసి సొంత గ్రామాలకు వచ్చారు.  వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. సోమవారం వీరిద్దరు వేర్వేరుగా పులివెందులకు వచ్చారు. పులివెందులలో వారిరువురు కలుసుకున్నారు.  ఇంటి స్థలాల కొనుగోలు విషయమై కదిరి రోడ్డులో గల రియల్‌ ఎస్టేట్‌ భూములను పరిశీలించేందుకు గోవర్థన్‌రెడ్డికి చెందిన హోండా షైన్‌ బైకుపై కలిసి వెళ్లారు.

కదిరి రోడ్డులోని గంగమ్మ గుడి దాటిన తర్వాత కుడి వైపున వెంకటాపురం హరిజనవాడ సమీపంలో ఉన్న స్థలాల దగ్గరకు వెళుతుండగా.. ఒక్కసారిగా రోడ్డు ప్రక్కనే గల విద్యుత్‌ స్థంభాలకు ఉన్న 11కె.వి హైటెక్షన్‌ విద్యుత్‌ వైరు తెగి బైకుపై పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టూ పక్కల వారు రక్షించే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో వారిద్దరు అక్కడే సజీవ దహనమయ్యారు. మృతుడు గోవర్థన్‌రెడ్డికి భార్య పార్వతితోపాటు ఇద్దరు కుమార్తెలు జ్యోతి, సాయి, కుమారుడు బద్రినాథరెడ్డిలు ఉన్నారు. మరొక మృతుడు ప్రతాప్‌రెడ్డికి భార్య అనురాధతోపాటు కుమార్తె రక్షిత ఉన్నారు. స్థానికులు పోలీసులకు, ఫైరింజన్‌కు సమాచారం అందించారు. వారు చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమా..
గోవర్థన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిల మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే పులివెందులకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి వారు బోరున విలపించారు. తమకు దిక్కెవరంటూ వారు విలపిస్తున్న దృశ్యాలను చూసి స్థానికులు చలించిపోయారు.  గుణకణపల్లె, నల్లచెరువుపల్లెలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుదాఘాతంతో గోవర్థన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిలు మృతి చెందడానికి కేవలం విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. విద్యుత్‌ లైన్‌ తెగిపోవడానికి లైన్‌ ఫాల్ట్‌ కానీ, జంపర్‌ వద్ద లూజు ఉండటంవల్ల కానీ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఆ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై విద్యుత్‌ లైన్‌ను సరిచేయాల్సి ఉంటుంది.

కొన్ని రోజులుగా 11కె.వి విద్యుత్‌ లైన్‌ లూజుగా ఉందని స్థానికులు ఆరోపించారు. ఏటా ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్‌ అధికారులు లూజుగా ఉన్న వైర్లను, ఇతర వాటిని సరి చేయాల్సి ఉంది. జూన్, జులై నెలల్లో బలమైన గాలులు, వర్షాలు వస్తాయని ముందుగానే ట్రాన్స్‌కో అధికారులు ఇలాంటి పనులు చేపడుతుంటారు. వారు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందినట్లు మృతుల కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యుత్‌ శాఖ అధికారులపై 304ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పులివెందుల అర్బన్‌ సీఐ రామాంజినాయక్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement