కారు డిక్కీలో ఉన్న రామాంజినప్ప మృతదేహం కొటిపి గ్రామస్తులకు పట్టుబడిన నిందితులు
అనంతపురం, హిందూపురం అర్బన్: కొటిపి సమీపాన దారుణహత్య జరిగింది. ఓ వ్యక్తిని కాళ్లు, చేతులు కట్టేసి.. ఆ తర్వాత కారుతో తొక్కించి ప్రాణాలు తీశారు. ఆ తర్వాత మృతదేహాన్ని డిక్కీలో వేసుకుని మరో ప్రదేశంలో పడేసేందుకు తీసుకెళుత్తూ గ్రామస్తులకు పట్టుబడ్డారు. అనంతరం ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగిందని విచారణలో తేలింది. వివరాలిలా ఉన్నాయి. చెన్నకొత్తపల్లి మండలం దామాజిపల్లికి చెందిన రామాంజినప్ప(40), ఆదెమ్మ దంపతులు కొంతకాలం కిందట కూలిపనుల నిమిత్తం కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరుకు వలస వెళ్లారు. మిలటరీలో ఉద్యోగం మానేసి వచ్చిన లేపాక్షికి చెందిన నగేష్ కూడా గౌరీబిదనూరులోని తన సమీప బంధువు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆదెమ్మతో నగేష్‌కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిశాక రామాంజినప్ప తన భార్యను తీవ్రంగా మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.
అడ్డు తొలగించుకున్నారిలా..
భర్త రామాంజినప్ప అడ్డుతొలగించుకుంటే.. తర్వాత తమ వివాహేతర సంబంధాన్ని సాఫీగా కొనసాగించవచ్చని ఆదెమ్మకు ప్రియుడు తెలిపాడు. అందుకు ఆమె కూడా సమ్మతించడంతో నగేష్ తన బంధువు అయిన కిష్టప్పతో కలిసి హత్యకు కుట్ర పన్నాడు. రామాంజినప్పను అవసరానికి డబ్బు ఇస్తామని చెప్పి మంగళవారం రాత్రి కారులో పిలుచుకెళ్లారు. పూటుగా మద్యం తాగిన తర్వాత హిందూపురం కొటిపి సమీపంలోని రైల్వేగేటు పక్కన మట్టిదారిలోకి తీసుకెళ్లారు. అక్కడ రామాంజినప్పకు కాళ్లు, చేతులు కట్టేసి కిందపడేశారు. అనంతరం కారుతో తొక్కించారు. అరుపులు, శబ్దాలు, కారు లైటును రైల్వేగేట్‌మన్ సతీష్ గమనించాడు. అక్కడ ఏదో జరుగుతోందని భావించి గ్రామస్తులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. అలాగే హిందూపురం రూరల్ పోలీసులకూ సమాచారం చేరవేశాడు.
అడ్డంగా దొరికిపోయారు..
హత్య అనంతరం రామాంజినప్ప జుట్టును కత్తిరించారు. మృతదేహాన్ని మరొకచోట పడేయడం కోసం కారు డిక్కీలో వేసుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరేలోపు ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుందని గేట్‌మన్ గేటు వేశాడు. కారు వచ్చి అక్కడ ఆగగానే గేట్‌మన్ జోక్యం చేసుకుని ‘మీరు ఎవరు’ అంటూ వారిని ప్రశ్నించసాగాడు. రైలు వెళ్లిపోయేలోపు కొటిపి గ్రామస్తులు చేరుకున్నారు. కారులో ఉన్న ఇద్దరినీ రోడ్డుపైనే కూర్చోబెట్టి వివరాలు ఆరా తీశారు. ఇంతలో రూరల్ ఎస్‌ఐ శేఖర్ సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చారు. ఇద్దరి (నగేష్, బంధువు కిష్టప్ప)ని అదుపులోకి తీసుకుని, డిక్కీలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రామాంజినప్పను అంతమొందించామని ఒప్పుకున్నారు. హత్యకు వినియోగించిన గొలుసులను విక్రయించిన హిందూపురంలోని దుకాణాన్ని బుధవారం ఉదయం సీఐ వెంకటేశులు, ఎస్‌ఐ శేఖర్ విచారణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment