మృతి చెందిన గోపి ,మాధవి మృతదేహం
వివాహేతర సంబంధం ఒక మనిషిని మానవ మృగంగా మార్చేసింది. అభం, శుభం ఎరుగని ఇద్దరు వ్యక్తులు మృతి చెందడానికి కారణమైంది. మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిండ్ర మండలం అగరం పంచాయతీలోని దళితవాడలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
చిత్తూరు, నిండ్ర: విషం కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగడంతో ఇద్దరు మరణించిన ఉదంతమిది. నిండ్ర సీఐ వెంకటేశులు కథనం..అగరం దళితవాడకు చెందిన గోపి(38), పరిమళ భార్యాభర్తలు. ఇదే గ్రామానికి చెందిన వేలాయుధం(40)తో పరిమళకు వివాహేతర సంబంధం కలిగింది. పరిమళ భర్తతో చనువు పెంచుకున్న వేలాయుధం అతన్ని మద్యం మత్తులో దింపి పరిమళతో సాన్నిహిత్యంగా గడిపేవాడు. కొన్నాళ్లకు దీన్ని పసిగట్టిన గోపి భార‍్య పరిమళతో గొడవకు దిగాడు. దీంతో పరిమళ తన పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రావాలని పరిమళను వేలాయుధం ఫోన్‌లో ఒత్తిడి చేయగా తన భర్త గొడవకు దిగుతాడని అతనుండగా తాను రాలేనని తేల్చి చెప్పింది. దీంతో వేలాయుధం గోపిని ఎలాగైనా మట్టుపెట్టాలని నిశ్చయించుకున్నాడు.
తన చేతికి మట్టి అంటకుండా దీనికి వ్యూహరచన చేశాడు. దీనికిగాను దళితవాడకు చెందిన గోపి స్నేహితుడు మేఘవర్ణం(35)ను పావుగా వాడుకున్నాడు. రాత్రి పూట గోపి తప్పనిసరిగా మద్యం సేవిస్తాడని తెలిసిన వేలాయుధం కూల్‌డ్రింక్‌లో విషం కలిపి మేఘవర్ణంకు ఇచ్చి మద్యం తాగడానికి వాడుకోండని ఇచ్చి పంపాడు. ఇది తెలియని మేఘవర్ణం తన మిత్రుడు గోపికి కూల్‌డ్రింక్‌ను మద్యంలో కలిపి ఇచ్చాడు. అతను తాగగా మిగిలిన కూల్‌డ్రింక్‌ను విషం అని తెలియకపోవడంతో ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో ఉంచాడు.
కాసేపటికే ఫ్రిజ్‌లో కూల్‌డ్రింక్ బాటిల్ చూసిన మేఘవర్ణం భార్య మాధవి(28) తన భర్త కూల్ డ్రింక్ తెచ్చి ఉంచాడని భావించి దానిని తాగింది. విష ప్రభావంతో కొంతసేపటికే కేకలు వేసి స్పృహ కోల్పోయి పడిపోయింది. ఇంటికి వచ్చిన మేఘవర్ణం ఆమెను నగరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. మరోవైపు మంగళవారం రాత్రి 10 గంటలకు అపస్మారక స్థితిలో ఉన్న గోపిని గుర్తించిన స్థానికులు అతను మృతి చెందినట్లు గుర్తించారు. మేఘవర్ణం వెంటనే గోపి ఇంటికి వెళ్లగా అప్పటికే అతను ఇంటిలో మృతి చెంది ఉన్నాడు. పోలీసులు నిందితుడు వేలాయుధం అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనాథలైన మాధవి పిల్లలు , రోదిస్తున్న గోపి భార్యాపిల్లలు
మూడు కుటుంబాలు చిన్నాభిన్నం
గోపి, మాధవి మృతి చెందడంతో ఆ రెండు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. వేలాయుధం అరెస్టు కావడంతో అతని కుటుంబానిదీ ఇదే పరిస్థితి తప్పలేదు. వివాహేతర సంబంధం మూడు కుటుంబాలను నాశనం చేసిందని గ్రామస్తులు వ్యాఖ్యానించారు.
పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం
మాధవి మృతి చెందడంతో ఆమె కుమారుడు రవితేజ(13), కుమార్తె భార్గవి(9), గోపి మృతి చెందడంతో అతని కుమార్తెలు శృతి (15), కీర్తన (13)ల పరిస్థితి ప్రశ్నార్థకమైంది. ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోతే, ఇద్దరు పిల్లలు తండ్రిని కోల్పోయారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉసురు తీసిన వివాహేతర సంబంధం
పుత్తూరు: వివాహేత సంబంధం ఒక మహిళ ఉసురు తీసింది. బుధవారం పుత్తూరు మున్సిపాలిటీలోఇది చోటుచేసుకుంది. సీఐ యల్లమరాజు కథనం.. మున్సిపల్ పరిధిలోని తాయిమాంబాపురం గ్రామానికి చెందిన రామదాసు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈయనకు భార్య మునెమ్మ (30), ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన మహేష్‌తో మునెమ్మకు వివాహేతర సంబంధం ఉంది. మంగళవారం పుత్తూరు పక్కనే ఉన్న కొండలచెరువు గ్రామంలో నిర్వహిస్తున్న జాతరకు మునెమ్మ వెళ్లింది. విషయం తెలుసుకున్న మహేష్ కూడా కొండలచెరువుకు వెళ్లాడు. మంగళవారం రాత్రి గ్రామ పొలిమేర్ల వద్ద వారిద్దరూ గొడవ పడ్డారు. స్థానికులు ఇద్దరికీ సర్దిచెప్పి పంపించేశారు. తనకున్న వివాహేత సంబంధం అందరికీ తెలిసిపోయిందనే అవమాన భారం భరించలేక మునెమ్మ బుధవారం వేకువజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి పుత్తూరు పోలీసులకు సమాచారం చేరవేశారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment