పెళ్లింట తీవ్ర విషాదం | Four Family Members Died Due To Electric Shock In Bhongir District | Sakshi
Sakshi News home page

పెళ్లింట తీవ్ర విషాదం

Published Sat, Jun 22 2019 8:20 AM | Last Updated on Sat, Jun 22 2019 8:41 AM

Four Family Members Died Due To Electric Shock In Bhongir District - Sakshi

భూదాన్‌పోచంపల్లి: రెండు రోజులపాటు బాజాభజంత్రీలు, కుటుంబసభ్యులు, బంధువులతో సందడిగా మారిన పెళ్లి ఇంటిపై విధి కరెంటు రూపంలో కన్నెర్రజేసింది. పారాణి కూడా ఆరక ముందు కరెంట్‌షాక్‌తో పెళ్లి కొడుకు, అతని తల్లి, తండ్రి, మేనత్త మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిందం సాయిలు(60) రెండో కుమారుడైన   ప్రవీణ్‌ (23) వివాహం ఈ నెల 19న ఇదే మండలం రేవనపల్లి గ్రామానికి చెందిన యువతితో జరిగింది. శుక్రవారం పెళ్లి కుమార్తె ఇంట్లో చిన్నవిందు ఉండడంతో సాయిలు కుటుంబసభ్యులు, బంధువులంతా కలిసి వెళ్లారు. సాయంత్రం పోచంపల్లి మండలంలో వర్షం కురిసింది. వీరంతా రాత్రి తిరిగి ఇంటికి వచ్చారు.

పెళ్లి సందర్భంగా ఇంటికి జే వైరు ద్వారా సీరియల్‌ బల్బులను అమర్చారు. పెళ్లి కుమారుడి మేనత్త శ్యామల గంగమ్మ ఆ జే వైరుపై తెలియక తడిబట్టలు ఆరేసింది. దీంతో ఆమెకు కరెంట్‌ షాక్‌ తగిలింది. ఆమెను రక్షించేందుకు పెళ్లికుమారుడి తల్లి చిందం గంగమ్మ పట్టుకోగానే ఆమెకూ షాక్‌ తగిలింది. గంగమ్మకు రక్షించబోయి సాయిలు, తర్వాత పెళ్లి కుమారుడు ప్రవీణ్‌ ఇలా ఒకరి తర్వాత ఒకరు పట్టుకోవడంతో వారందరికీ షాక్‌ తగిలింది. ఏమైందో తెలియక సాయిలు పెద్ద కుమారుడైన చిందం భాస్కర్‌ ఫీజు తీసేయడంతో కింద పడిపోయారు. అప్పటికే తీవ్ర గాయాలైన వీరిని పోచంపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్‌ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే వారు మృతిచెందారని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement