
పామిడి: శబరిమల యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో అనంతపురం జిల్లా పామిడికి చెందిన నలుగురు భక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి తమిళనాడులోని మదురై వద్ద చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు పామిడికి చెందిన రఘు ఏడు నెలల క్రితం కొత్త కారు కొనుగోలు చేశారు. ఈ కారులోనే అతనితో పాటు పామిడికి చెందిన రాంప్రసాద్, మధుసూదన్‌రెడ్డి, డ్రైవర్ కుమ్మర మహేశ్, తాటిచెర్ల సుబ్బారాయుడు మూడు రోజుల క్రితం శబరిమల బయలుదేరి వెళ్లారు. అయ్యప్పస్వామిని దర్శించుకున్న తర్వాత సోమవారం తిరిగి పామిడికి బయలుదేరారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో మదురై జిల్లా తిరుమంగళం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని లోయలో పడిపోయింది.
ఘటనలో అన్నదమ్ములైన రఘు (28), రాంప్రసాద్ (26)లతో పాటు మధుసూదన్‌రెడ్డి(28), కుమ్మర మహేశ్(26) అక్కడికక్కడే మృతి చెందారు. తాటిచెర్ల సుబ్బారాయుడు(49)కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో స్థానిక బొడ్రాయి వీధికి చెందిన రఘు హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో ఎస్‌ఐగా పనిచేస్తుండగా, రాంప్రసాద్ పెనుకొండలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. స్థానిక బ్రాహ్మణవీధివాసి మధుసూదన్‌రెడ్డి వస్త్రవ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు సంతానం. అలాగే కుమ్మర మహేశ్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఘటన సమాచారం తెలియడంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment