స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు ,వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాఘవేందర్‌రెడ్డి
ములుగులో సంచలనం సృష్టించిన మస్రగాని వెంకటలక్ష్మి హత్య కేసు మిస్టరీ వీడింది. దండుపాళ్యం సినిమా తరహాలో దుండగులు పథకం ప్రకారం ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నగలు, డబ్బుల కోసమే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఘటన జరిగి నెల తిరగక ముందే అనుమానితుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు.
వరంగల్ , ములుగు: మండలంలోని జంగాలపల్లిలో జనవరి 19వ తేదీన జరిగిన మస్రగాని వెంకటలక్ష్మీ(65) హత్య మిస్టరీని ములుగు పోలీసులు ఛేదించారు. నిందితులను గురువారం సాయంత్రం ములుగు బస్టాండ్‌లో పట్టుకుని విచారించి కోర్టులో హాజ రుపరిచారు. డీఎస్పీ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ములుగు మండలం జంగాలపల్లికి చెందిన మస్రగాని రతన్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పెద్దలేపాక మండలం వల్లూరు చెందిన దండబోయిన రాజాతో గత కొనేళ్లుగా పరిచయం ఉంది. రాజా 12 ఏళ్లుగా స్థానికంగా వరికోత మిషన్లను నడపడానికి వెంకటలక్ష్మి కుమారుడు మస్రగాని విజయ్ ఇంట్లో ఉండేవాడు. ఈ క్రమంలో జంగాలపల్లికి చెందిన యువతిని రాజా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాజా తీసుకొచ్చే వరికోత మిçషన్లను ఇదే గ్రామానికి చెందిన మస్రగాని రతన్ లీజు కు తీసుకొని నడిపేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.
నగలు, నగదు కోసమే..
ప్రస్తుతం రాజా, రతన్‌లు ఎలాంటి పనిచేయకపోవడంతోపాటు తాగుడుకు బానిసయ్యారు. ఈ క్రమంలోనే ఇంటి పక్కనే ఉన్న వెంకటలక్ష్మీ వద్ద భారీగా బంగారు ఆభరణాలు, డబ్బులు ఉన్నాయని రాజాకు రతన్ వివరించాడు. దీంతో ఆ నగలు, నగదును ఎలాగైనా సొంతం చేసుకోవాలని పథకం పన్నారు. ఇద్దరు స్వయంగా వెళితే బాగుండదని రాజా తన స్వగ్రామం వల్లూరుకు చెందిన కార్పెంటర్ నవీన్‌కుమార్(21)ను సాయం కోరాడు. నవీన్ తన స్నేహితుడు మునీర్ భాషా(18)ను వెంట తీసుకొచ్చాడు. ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రతన్ లాంగ్‌ట్రిప్పులకు వెళ్లేవాడు. ఇందులో భాగంగా గత నెల 17న తిరుపతికి వెళ్లాడు. ఈ క్రమంలోనే కడప నుంచి రతన్‌తోపాటు నవీన్‌కుమార్, మునీర్‌భాషాను ములుగుకు తీసుకొచ్చాడు.
కాళ్లు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి హత్య..
వెంకటలక్ష్మీ మధ్యాహ్నం పూట ఒంటరిగా ఉందని తెలుసుకొని 1.30 నిమిషాల సమయంలో నవీన్‌కుమార్, మునీర్‌భాషా ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. మంచంపై ఒంటరిగా పడుకున్న వెంకటలక్ష్మిపై ఒక్కసారిగా దాడి చేశారు. నవీన్‌కుమార్ రెండు కాళ్లను గట్టిగా పట్టుకోగా మునీర్‌భాషా ముఖంపై దాడి చేయడంతో నోట్లో ఉన్న పంటి సెట్టు కిందపడింది. ఇదే సమయంలో ముఖంపై పిడిగుద్దులు గుద్ది, నోట్లో గుడ్డను కుక్కారు. ఆమె అరుపులు బయటికి రాకుండా తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టర్‌ను నోటితోపాటు కాళ్లు, చేతులకు బలంగా చుట్టారు. వృద్ధురాలు మృతిచెందిందని నిర్ధారించుకున్న తర్వాత ఒంటిపై ఉన్న 9 తులాల 15 గ్రాముల బంగారం, 20 తులాల వెండి కడియాలను బలవంతంగా తీసుకున్నారు. దీంతోపాటు ఇంట్లో ఉన్న బీరువాలో వెతికారు. దొంగిలించిన ఆభరణాలు తీసుకొని నేరుగా ములుగులో ఉన్న రాజా దగ్గరికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ములుగుకు వచ్చిన రతన్ ఆ ఆభరణాలను తీసుకొని ముగ్గురికి బస్సు చార్జీలకు డబ్బులు ఇచ్చి కడపకు పంపించాడు.
నిందితులను పట్టించిన ఫోన్ కాల్ డాటా..
హత్య జరిగిన రోజు వచ్చిన ఫిర్యాదులు, ఇంటి పక్కన ఉన్న వారు చెప్పిన ఆధారాలనుబట్టి అనుమానితులుగా ఉన్న వారి ఫోన్‌నంబర్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో రాజా ఫోన్ మూడు రోజుల తర్వాత స్విచ్చాఫ్ కావడాన్ని గుర్తించారు. అనుమానితులుగా ఉన్న వారి ఫోన్ కాల్ డాటాను సేకరించారు. రతన్‌పై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటికి వచ్చింది. దీంతో నిందితులుగా ఉన్న మిగతా ముగ్గురి కోసం సీఐ సాయిరమణ ఆధ్వర్యంలో హెడ్‌కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుళ్లు కిషన్, శ్రీనివాస్, ఛోటు కడపకు వెళ్లి గాలించారు. అయినా ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ములుగు బస్టాండ్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో సీఐ సాయిరమణ, ఎస్సై బండారి రాజు పాల్గొన్నారు. కాగా, కేసు మిస్టరీని ఛేదించిన సీఐ సాయిరమణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కేసులో ప్రధాన నిందితులు రతన్, రాజా వెంకట లక్ష్మీకి దూరపు బంధువులు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment