
ప్రమాదానికి గురైన కారు (ఇన్‌సెట్‌లో) ఇబ్రహీంసాహెబ్
రాయదుర్గంటౌన్/రూరల్: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం నల్లంపల్లి–వీరాపురం గ్రామాల మధ్య బసయ్యతోట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ సహా మరో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ షేక్ ఇబ్రహీం సాహెబ్ ఎన్నికల విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం తన సొంత కారులో అనంతపురం వెళ్లారు. ఆయన వెంట మున్సిపల్ ఆర్వో అమీర్‌బాషా, ఆర్‌ఐ దాదా ఖలందర్ తదితరులు ఉన్నారు. విధులు ముగించుకుని రాత్రి 9,30 గంటల ప్రాంతంలో రాయదుర్గం తిరిగి వస్తుండగా అటువైపు నుంచి ఎదురుగా వస్తున్న చెన్నైకి చెందిన కారు వీరి కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఆర్వో అమీర్‌బాషా, ఆర్‌ఐ దాదా ఖలందర్, డ్రైవర్ ఎర్రిస్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆర్‌ఐ సత్యనారాయణతో పాటు మరో కారులోని ప్రభు, మురుగన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు తరలించారు.
శోకసముద్రంలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది
మరో 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే రాయదుర్గం చేరుకుంటారనగా మృత్యువు వీరిని కబళించింది. నలుగురు ఉద్యోగులు దుర్మరణం చెందడంతో రాయదుర్గం మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది, కౌన్సిల్ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, అధికారులు రాయదుర్గం ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment