సాక్షి, సిటీబ్యూరో: తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు ఇస్తామని ఎరవేస్తూ మోసగాళ్లు రూ.కోట్లు దండుకుంటున్నారు. ఇటీవల సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో భారీ మోసాలు వెలుగులోకి వచ్చాయి. మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాల్లో ‘కాయ’ బాగా పాపులర్ అయ్యింది. గత ఏడాది సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకున్న కరక్కాయ, మునక్కాయల కేసులు విచారణలో ఉండగానే...తాజాగా రాచకొండ పోలీసులు ‘పల్లీ కాయల’ మోసం గుట్టురట్టుకావడం జనం బలహీనత, అత్యాశకు అద్దం పడుతోంది. ఈ మూడు మోసాల విధానం ‘ఆరోగ్య’దాయకంగా ఉండటంతో పాటు అనతికాలంలోనే లక్షాధికారులు కావొచ్చనే ఆయా కంపెనీల మాటలు నమ్మి వేల మంది వందల కోట్లు సమర్పించుకున్నారు.
కరక్కాయ మోసమిలా...
నెల్లూరు జిల్లా అంబలపురానికి చెందిన ముప్పల శివ మరో ఇద్దరితో కలిసి కేపీహెచ్‌బీలో సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీటూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గతేడాది జూన్‌లో కార్యాలయాన్ని ప్రారంభించాడు. అయుర్వేదిక మందుల్లో ఉపయోగపడే కరక్కాయలపై పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు పొందొచ్చంటూ దినపత్రికలు, సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చారు. కిలో కరక్కాయలను రూ.వెయ్యికి కొనుగోలు చేసి 15 రోజుల్లో పొడి చేసి తిరిగి ఇస్తే ఆ వెయ్యితో పాటు అదనంగా రూ.300, మొత్తం రూ.1300లు ఇస్తామంటూ నమ్మించారు. దీన్ని నమ్మిన 650 మంది తమ తోటి బంధువులు, మిత్రులు, సుపరిచితులను ఈ స్కీమ్‌లో చేర్పించడంతో రూ.తొమ్మిది కోట్లు పెట్టుబడులు వచ్చాయి. తొలినాళ్లలో కస్టమర్లకు చెల్లించినా వీరు ఆ తర్వాత బిచాణా ఎత్తేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతున్న ఈ కేసులో బాధితులకు డబ్బులు అందలేదు.
మునక్కాయతో ముంచారిలా...
ఏడో తరగతి వరకు చదివిన హర్యాణా వాసి రాధేశ్యామ్ మరో ఇద్దరితో కలిసి 2015లో ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌ఎంఎల్‌సీ)ను హిస్సార్‌లో ప్రారంభించారు. ముఖ్యంగా ఆరోగ్యకర ఉత్పత్తులైన మునక్కాయ పొడి ప్యాక్ చేసిన డబ్బాలతో ఈ గొలుసు దందా సాగించారు. రూ.7,500లు చెల్లించి మీరు సభ్యుడిగా చేరితే రూ.2,500 ఫీజు మినహయించి మిగిలిన రూ.ఐదు వేలకు మునక్కాయ పొడి ఉత్పత్తులు ఇస్తారు. మీరు మరో ఇద్దరిని చేర్పిస్తే నెలకు రూ.500ల బోనస్‌తో పాటు నెలకు రూ.2,500 సంపాదించుకోవచ్చంటారు. ఎక్కువ సభ్యులను చేర్పించిన వారికి టైటిల్‌తో పాటు భారీగా ప్రైజ్‌మనీ కూడా ఇచ్చేవారు...ఇలా అమాయకుల నుంచి దాదాపు రూ.మూడువేల కోట్ల వరకు మోసం చేసిన వీరిని గతేడాది సెప్టెంబర్ 8న గుర్గావ్‌లో అరెస్టు చేశారు. తక్కువ ధరకే మునక్కాయలు కొనుగోలు చేసి పొడిచేసి కస్టమర్లను మోసగించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలో బాధితులను గుర్తించినా ఇప్పటివరకు న్యాయస్థానం ద్వారా పోలీసు అధికారులు ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల్లోని రూ.200 కోట్లను చెల్లించలేకపోయారు. ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.
‘పల్లీ కాయ’తో పల్టీ కొట్టించాడు...
ఇంటర్మీడియెట్ వరకే చదువు ఆపేసిన నిజామాద్ జిల్లా మోర్తాండ్ మండలం సంకేట్ గ్రామానికి చెందిన జిన్న కాంతయ్య అలియాస్ జిన్న శ్రీకాంత్‌రెడ్డి అగర్‌బత్తుల వ్యాపారంతో మోసాలు మొదలెట్టి 2017 డిసెంబర్ నుంచి గ్రీన్‌గోల్డ్ బయోటెక్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాడు. సూరత్ నుంచి రూ.20 వేలకు కొనుగోలు చేసి తీసుకువచ్చిన పల్లీనూనె యంత్రాలతో రూ.లక్షల్లో ఆదాయం వస్తుందంటూ ప్రచారానికి తెరలేపాడు. ఇంట్లోనే ఉండి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించవచ్చంటూ ఆశచూపాడు. ఈ గొలుసు కట్టు పథకంలో భాగంగా రూ.లక్ష ఇచ్చి పల్లీనూనె యంత్రాన్ని కొనుగోలు చేస్తే 40 కిలోల పల్లీనూనె, 200 కిలోల పల్లీలు ఇస్తామంటూ చెబుతాడు.
ఈ రకంగా పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.పది వేలతో పాటు రూ.ఐదు వేల అలవెన్స్ 24 నెలల పాటు ఇస్తానంటూ మభ్యపెడతాడు. ఒకవేళ రూ.రెండు లక్షల మెషీన్ కొనుగోలు చేస్తే 80 కిలోల నూనె, 400 కిలోల పల్లీలు ఇచ్చి, ఆ పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.20 వేలతో పాటు అలవెన్స్ కింద రూ.పది వేలు రెండేళ్ల పాటు చెల్లిస్తామంటాడు. అగ్రిమెంట్ సమయంలో ప్రజలను నమ్మించేందుకు పిన్ నంబర్లు కూడా కేటాయిస్తాడు. అలాగే కస్టమర్ల దగ్గరి నుంచి రెండు నెలల పాటు తీసుకున్న ఆయిల్‌ను మళ్లీ ఇతర కస్టమర్లకు ప్యాకేజీ కింద ఇస్తుంటాడు. తొలుత చేరిన వ్యక్తి మరో ఇద్దరిని చేర్పిస్తే కమిషన్ రూపంలో డబ్బులు ఇస్తామని ఆశచూపాడు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ఏజెంట్లను నియమించుకుని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వంద కోట్ల వరకు మోసం చేశాడు. ఈ విషయం సీపీ మహేష్ భగవత్ దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు నిందితుడు కాంతయ్యతో పాటు మరో ఇద్దరిని గత నెల 29న అరెస్టు చేశారు.
చేరినా...చేర్పించినా నేరమే
సులభ పద్ధతిలో ఆదాయం వస్తుందని గొలుసు కట్టు పథకంలో పెట్టుబడులు పెట్టినా, ఇతరులతో పెట్టుబడులు పెట్టించినా అది నేరమవుతుంది. 1978, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చూ అంటే వచ్చే ప్రకటనలు నమ్మకండి. చాలా మంది పోయింది కొంతమొత్తం కాబట్టి ఠాణాకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. ఇవే మోసగాళ్లకు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ప్రకటన మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి. –వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్
అప్రమత్తతతోనే మోసాలకు అడ్డుకట్ట
చిన్న మొత్తాలతో భారీగా డబ్బులు సంపాదించవచ్చనే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరెన్నీ చెప్పినా నెలల్లోనే లక్షాధికారులు కావొచ్చనే కల్లబొల్లి మాటలు నమ్మకండి. సులభ పద్ధతిన డబ్బులు వస్తున్నాయంటే అది మోసమే అవుతుంది. కరక్కాయ, మునక్కాయ, పల్లీ కాయలతో ఎంఎల్‌ఎం మోసాలతో కోట్లు దండుకున్నారు. ఈ గొలుసు కట్టు పథకాలతో జరజాగ్రత్తగా ఉండాలి. మీ దృష్టికి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. –మహేష్ భగవత్, రాచకొండ సీపీ
Comments
Please login to add a commentAdd a comment