ఎయిర్‌టెల్‌ సంస్థ సీఈఓనని ‘ఫ్యాన్సీ’ వల | Man Fraud With Fancy Mobile numbers in Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఫ్యాన్సీ’ వల

Published Tue, Oct 15 2019 11:32 AM | Last Updated on Mon, Oct 21 2019 8:36 AM

Man Fraud With Fancy Mobile numbers in Hyderabad - Sakshi

మద్దెల దీపుబాబు

సాక్షి, సిటీబ్యూరో: ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కార్పొరేట్‌ సంస్థలకు చెందిన ప్రముఖులను టార్గెట్‌గా చేసుకుంటాడు... తక్కువ ధరకు ఫ్యాన్సీ సెల్‌ఫోన్‌ నంబర్లు ఇస్తానంటూ ఎస్సెమ్మెస్‌ పంపిస్తాడు... కాల్‌ చేసిన వారితో ఎయిర్‌టెల్‌ సంస్థ సీఈఓనని పరిచయం చేసుకుంటాడు... ఆసక్తి చూపిన వారి నుంచి అందినంత బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయించుకుంటాడు... ఆపై తన సెల్‌ నంబర్‌ మార్చేసి మోసం చేస్తాడు... ఈ పంథాలో రెచ్చిపోతున్న మద్దెల దీపుబాబును నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడికి విఠల్, గోపాల్, ప్రతాప్‌రెడ్డి అనే పేర్లు కూడా ఉన్నాయని జాయింట్‌ పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి సోమవారం వెల్లడించారు. సెల్‌ఫోన్‌ ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్‌ను ఇతను క్యాష్‌ చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రికి చెందిన దీపుబాబు బీటెక్‌ చదువుతూ మధ్యలోనే మానేశాడు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాల బాట పట్టాడు. సాధారణ వ్యక్తుల్ని టార్గెట్‌గా చేసుకుంటే వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని భావించాడు. అదే ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కార్పొరేట్‌ సంస్థలకు చెందిన పెద్దల్ని మోసం చేస్తే చిన్న చిన్న మొత్తాల కోసం పోలీసులకు ఫిర్యాదు చేయరని భావించాడు. దీనికోసం బోగస్‌ పేర్లు, వివరాలతో కొన్ని సిమ్‌కార్డులు తీసుకోవడంతో పాటు బ్యాంకు ఖాతాలు తెరిచాడు. ఇంటర్‌నెట్‌ ద్వారా పలువురు ప్రముఖుల ఫోన్‌ నంబర్లు సేకరించేవాడు. తన వద్ద ఉన్న సిమ్‌కార్డుల్ని వినియోగించి ఆయా ప్రముఖులకు ఎస్సెమ్మెస్‌లు పంపేవాడు. అందులో తాను ఎయిర్‌టెల్‌ సంస్థ సీఈఓ అని, 9899999999, 9123456789, 9999999099, 9999999999 తదితర ఫ్యాన్సీ నంబర్లు అందుబాటులో ఉన్నాయని, తక్కువ ధరకే వీటిని అందిస్తున్నామని చెప్పేవాడు.

సాధారణంగా ఈ తరహా ఫ్యాన్సీ నంబర్లు రూ.లక్షకు పైగా ఖరీదు చేస్తాయి. అయితే ఆసక్తి చూపి తనను సంప్రదించే వారితో ఇతగాడు రూ.40 వేల నుంచి రూ.50 వేలకు ఈ నెంబర్లు ఇస్తానంటూ చెప్పేవాడు. ఇది అర్జంట్‌ సేల్‌ అని, అనేక మంది ఖరీదు చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పడంతో ఎదుటి వ్యక్తి వెంటనే కొనడానికి ముందుకు వచ్చేవాడు. అలాంటి వారి నుంచి అడ్వాన్స్‌గా లేదా మొత్తం తాను సూచించిన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకునే వాడు. ఆపై తన సెల్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఆ సిమ్‌కార్డు ధ్వంసం చేసేవాడు. ఇలా ఇతగాడి చేతిలో అనేక మంది ప్రముఖులు మోసపోయారు. అయితే ఎవరికి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేయడంతో దీపుబాబు ఆటలు సాగాయి. నగరానికి చెందిన జానకి రామమోహన్‌ నుంచి ఇతను ఇదే తరహాలో రూ.45,800 కాజేయడంతో ఆయన సిటీ సైబర్‌ క్రైమ్‌ అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ఇన్‌స్పెక్టర్‌ బి.మధుసూదన్‌ నేతృత్వంలో ఎస్సైలు టి.వినయ్‌కుమార్, హెడ్‌–కానిస్టేబుల్‌ హనుమాన్‌ ప్రసాద్, కానిస్టేబుల్‌ ప్రభు దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతా నంబర్ల ఆధారంగా నిందితుడు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్ళిన ప్రత్యేక బృందం దీపుబాబును అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఇతడు ఇదే తరహా నేరాలు చేయడంతో గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల, గుంటూరు పోలీసులు అరెస్టు చేసినట్లు తేలింది. కొన్నాళ్లు గుంటూరులో నివసించిన ఇతను ఆపై తన మకాంను బెంగళూరుకు మార్చాడు. కేవలం మోసా లు చేయడం మినహా ఎలాంటి పని చేయట్లేదని తేలింది. ఇలా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడంతో పాటు గుర్రపు రేసుల్లోనూ పందేలు కాసేవాడని వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఓ మాజీ ఎమ్మెస్సీ సైతం ఇతడి చేతిలో మోసపోయినట్లు సమాచారం. సైబర్‌ క్రైమ్‌ ఠాణాలోనే నమోదైన మరో కేసులోనూ దీపుబాబు నిందితుడిగా ఉండటంతో అతడిని పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని అధికారులు నిర్ణయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement