మెడిసిన్‌ పీజీ సీటు పేరుతో నగర వైద్యురాలికి టోకరా | Fraud In Medical PG Seats Hyderabad | Sakshi
Sakshi News home page

డబ్బు తీసుకెళ్లింది సునీల్‌!

Published Thu, Nov 1 2018 9:36 AM | Last Updated on Mon, Nov 5 2018 1:31 PM

Fraud In Medical PG Seats Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బల్క్‌ ఎస్సెమ్మెస్‌ వచ్చింది... మెడిసిన్‌ పీజీ సీట్లంది... అందులో ఉన్న నెంబర్‌కు సంప్రదిస్తే ముఠా మాట్లాడింది... వందలు, వేలకు డీడీలు కట్టించింది... స్ఫూఫింగ్‌ చేసిన మెయిల్స్‌ ద్వారా సీట్లు ఇచ్చేసింది... నేరుగా వచ్చి రూ.లక్షల్లో ఎత్తుకుపోయింది. సెంట్రల్‌ పూల్, ఎన్‌ఆర్‌ఐ కోటాల్లో భారత్, నేపాల్‌ల్లోని పేరున్న వైద్య కళాశాలల్లో మెడిసిన్‌లో పీజీ సీట్లు ఇప్పిస్తామంటూ నగరానికి చెందిన వైద్యురాలిని రూ.81 లక్షలు మోసం చేసిన ఈ ఢిల్లీకి చెందిన నకిలీ డాక్టర్ల ముఠా గుట్టును నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ ఏడాది జూన్‌లో రట్టు చేశారు. అప్పట్లో ప్రధాన సూత్రధారితో పాటు మరో అనుచరుడినీ పట్టుకున్నారు. వీరి సూచనల మేరకు నగరానికి వచ్చిన డబ్బు తీసుకువెళ్ళిన వ్యక్తి çసునీల్‌కుమార్‌గా గుర్తించిన అధికారులు అతడి కోసం ఢిల్లీలో ముమ్మరంగా గాలించారు. ఎట్టకేలకు పట్టుకుని అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై నగరానికి తీసుకువచ్చి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

ఆర్‌ఎస్‌ యాదవ్‌ పేరుతో ఎస్సెమ్మెస్‌...
నగరానికి చెందిన డాక్టర్‌ ఫాతిమా రజ్వీ ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తన కుమార్తెకు పీజీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో ఉండగానే ఆమెకు కొన్ని నెలల క్రితం
(HP& MKTING,  AD&  MKTING)ల నుంచి బల్క్‌ ఎస్సెమ్మెస్‌ వచ్చింది. అందులో పీజీ సీట్ల కోసం సంప్రదించాలంటూ ఆర్‌ఎస్‌ యాదవ్‌ పేరు, ఫోన్‌ నెంబర్‌ ఉండటంతో ఆమె అలానే చేశారు. ఆమె కుమార్తెకు బెంగళూరులోని బెంగళూరు మెడికల్‌ కాలేజీ, మైసూరులోని మైసూరు మెడికల్‌ కాలేజ్, బళ్ళారిలోని విజయ్‌నగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ల్లో ఎక్కడైనా సీటు ఇప్పిస్తామంటూ మాట్లాడాడు. తొలుత న్యూ ఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ పేరుతో రూ.5 వేలు డీడీ తీయమని చెప్పాడు. ఆ సంస్థ నుంచే ఈ–మెయిల్‌ వచ్చినట్లు స్ఫూఫింగ్‌ పరిజ్ఞానం ద్వారా
(addir@mohfw.nic.in) నుంచి ఓ దరఖాస్తు సైతం పంపాడు. సింగ్‌గా చెప్పుకున్న వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చి  దరఖాస్తుతో పాటు డీడీ తీసుకుని వెళ్ళాడు. వెళ్తూ విషయం గోప్యంగా ఉంచాల్సిందిగా ఆమెకు చెప్పాడు.  

కొనసాగిన స్పూఫింగ్‌ వ్యవహారం..
ఇది జరిగిన కొన్ని రోజులకు కేంద్ర ఆధీనంలోని మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ నుంచి సెంట్రల్‌ పూల్‌ కోటాలో సీటు ఖరారైనట్లు మరో స్ఫూఫ్డ్‌ మెయిల్‌ (noreply@mohfw.nic.in) నుంచి ఫాతిమాకు సందేశం ఇచ్చారు. ఇది చూసిన ఆమె కేంద్ర శాఖ నుంచే మెయిల్‌ వచ్చినట్లు భావించారు. ఆపై డాక్టర్‌ ఆర్‌ఎస్‌ యాదవ్‌గా చెప్పుకున్న ఢిల్లీకి చెందిన సునీల్‌కుమార్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి రెండుసార్లు వచ్చి రూ.10 లక్షలు, రూ.20 లక్షలు ఇన్‌స్టాల్‌మెంట్స్‌ తీసుకున్నాడు. ఆపై(noreply@mohfw.nic.in) నుంచే మరో ఈ–మెయిల్‌ పంపిన మోసగాళ్ళు బళ్ళారిలోని విజయ్‌నగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో సీటు ఖరారైనట్లు పేర్కొన్నారు. మళ్ళీ సిటీకి వచ్చిన సునీల్‌ మరో రూ.36 లక్షలు తీసుకున్నాడు.( www.rguhs.ac.in) వెబ్‌సైట్‌లోకి వెళ్ళి వివరాలు పూరించడంతో పాటు రూ.3 వేలు చెల్లించాలని సూచించారు. 

హఠాత్తుగా సెల్‌ఫోన్లన్నీ స్విచ్ఛాఫ్‌...
ఈ ప్రక్రియ పూర్తి చేయించిన తర్వాత డెర్మటాలజీ విభాగంలో పీజీ చేయడానికి సీటు ఖరారైందంటూ మరో ఈ–మెయిల్‌ పంపారు. విజయ్‌నగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్వహించే రాజీవ్‌ గాంధీ యూనివర్విటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరుతో మరో రూ.16,700 ట్యూషన్‌ ఫీజు డీడీ రూపంలో చెల్లించమన్నారు. ఈసారి ఫాతిమానే ముంబై రప్పించుకున్న ముఠా అక్కడి విమానాశ్రయంలో కలిసి డీడీతో పాటు రూ.15 లక్షల నగదు తీసుకున్నారు. ఇలా మొత్తం రూ.81 లక్షలు వసూలు చేసిన తర్వాత తమ సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఢిల్లీకి చెందిన ఘరానా మోసగాడు సంతోష్‌ రాయ్, ఇతడి అనుచరుడు మనోజ్‌ కుమార్‌ను జూన్‌లో అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలోనే ఈ గ్యాంగ్‌కు చెందిన ఢిల్లీ వ్యక్తి సునీల్‌ కుమార్‌ డాక్టర్‌ ఆర్‌కే యాదవ్‌గా, మనోజ్‌ కుమార్‌ సింగ్‌గా నటించినట్లు బయటపడింది. దీంతో అతడి కోసం గాలించిన ప్రత్యేక బృందం ఎట్టకేలకు పట్టుకోగలిగింది.  పరారీలో ఉన్న మరో నిందితుడు అమిత్‌కుమార్‌ కోసం గాలిస్తున్నారు. సంతోష్‌రాయ్, మనోజ్‌లపై దేశ వ్యాప్తంగా కేసులు నమోదై ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement