క్రియేషన్ చేసిన ఫొటో చూపిస్తున్న స్టూడియో యజమాని
నెహ్రూసెంటర్(మహబూబాబాద్): శివసత్తులకు ప్రభుత్వం నుంచి పెన్సన్ అందిస్తున్నారని, దీనికి క్రియేషన్ ఫొటోలు దిగాలనే పుకార్లు దావణంలా వ్యాపించాయి. ఈ మేరకు మంగళవారం మానుకోట పట్టణంలోని ఓ ఫొటో స్టూడియోలో ఫొటోల కోసం శివసత్తులు, దేవుడమ్మలు పోటెత్తారు.
ఫొటో స్టూడియో వద్ద భారీఎత్తున ప్రజలు గుమిగూడడంతో మహిళల మధ్య తోపులాట జరిగి గోడవకు దారితీసింది. ఈ విషయం మీడియాకు, పోలీసులకు తెలియడంతో అసలు విషయం బయటపడింది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం..
ఈ నెల 5న జిల్లావ్యాప్తంగా గిరిజన పూజారులకు జీవనభృతి కల్పించి, బ్రాహ్మణ పూజారులకు ఇచ్చే వేతనాలు తమకు కూడా కల్పించాలని గిరిజన పూజారులు మానుకోటలో మహాసభ నిర్వహించారు. ఆ మరునాటి రోజునుంచి శివసత్తులకు, గిరిజన పూజారులకు పెన్షన్ అందిస్తున్నారని, ఈ పెన్షన్‌కు అర్హతగా శివసత్తులు నెత్తిన బోనం, గొర్రెపోతు, వేప మండలు చేత పట్టుకొని ఫొటో దిగిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలని, దీనికి మానుకోటలోని ఓ ఫొటో స్టూడియోలో పెన్షన్‌కు సంబంధించిన ఫొటోలు తీస్తున్నారనే పుకార్లు షికార్లు కొట్టాయి.
ముందుగా మహబూబాబాద్ మండలంలోని సింగారం గ్రామానికి చెందిన గిరిజన శివసత్తులు వచ్చి ఫొటో దిగారు. వారు మరికొంత మందికి చెప్పడంతో వరంగల్, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల నుంచి గిరిజన మహిళలు మానుకోటకు వచ్చారు.
ఇదే అదునుగా భావించిన పట్టణంలో ఉన్న ఓ ఫొటోస్టూడియో నిర్వాహకుడు వారం రోజులుగా వందల మంది క్రియేషన్ ఫోటోలు తీశాడు. 5 కలర్ ఫొటోలకు రూ.150 చొప్పున వసూళ్లు చేసి క్రియేషన్ ఫొటోలు తీశాడు. ఈ క్రమంలోనే పెన్షన్‌కు మంగళవారం చివరి తేదీ అని మరికొన్ని పుకార్లు రావడంతో మూడు జిల్లాల నుంచి వందలాది మంది మహిళలు ఫొటో స్టూడియోకు చేరుకున్నారు.
అక్కడ మహిళల మధ్య తోపులాట జరగడంతో ఈ విషయం మీడియాకు, పోలీసులకు చేరింది. సంఘటనా స్థలానికి ట్రాఫిక్ ఎస్సై అశోక్, టౌన్ సీపీఐ జబ్బార్ చేరుకోగా అక్కడ గుమిగూడిన మహిళలు పోలీసులను చూసి పరుగులు తీశారు.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మహిళలతో పోలీసులు మాట్లాడుతూ ఇలాంటి పుకార్లను ప్రజలు నమ్మొద్దని, ఇలాంటి వారికి చట్టపరంగా చర్యలు తప్పవని, అక్కడికి వచ్చిన మహిళలను ఇంటికి వెళ్లిపోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment