సిమ్‌ తీశాడు.. చాటింగ్‌ చేశాడు! | Future Maker Case Acuused Chatting In Whatsapp | Sakshi
Sakshi News home page

సిమ్‌ తీశాడు.. చాటింగ్‌ చేశాడు!

Published Wed, Sep 12 2018 8:11 AM | Last Updated on Fri, Sep 21 2018 10:18 AM

Future Maker Case Acuused Chatting In Whatsapp - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గొలుసు కట్టు పథకంతో దేశవ్యాప్తంగా 35 లక్షల మందిని మోసగించి దాదాపు రూ.3,000 కోట్ల వరకు మోసం చేసిన కేసులో రెండో నిందితుడైన బన్సీలాల్‌ను పట్టుకునేందుకు సైబరాబాద్‌ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నాలుగు రోజుల నుంచి సమాజంతో ఎటువంటి సంబంధం లేకుండా సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ ముప్పుతిప్పలు పెడుతున్న బన్సీలాల్‌ను పట్టుకునేందుకు మంగళవారం ప్రత్యేక బృందాలు హర్యానా బయలుదేరి వెళ్లాయి. నాలుగురోజులు స్తబ్ధుగా ఉన్న బన్సీలాల్‌ సెల్‌ఫోన్‌ వాట్సాప్‌ చాటింగ్, కాల్స్‌ ద్వారా హర్యానాలోనే ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు ఇప్పటికే అక్కడి పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఒకటిరెండు రోజుల్లో బన్సీలాల్‌ను పట్టుకుంటే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన కీలక నిందితుడు రాధేశ్యామ్, సురేందర్‌ సింగ్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు.  

ఎంఎల్‌ఎంపై మరిన్ని ఫిర్యాదులు
మీరు రూ.7,500లు చెల్లిస్తే చాలు.. చేరినందుకు రూ.2,500ల ఫీజును మినహాయించి మిగిలిన రూ.5 వేలకు డ్రెస్సులు లేదంటే ఆరోగ్యకర ఉత్పత్తులు ఇస్తాం. మీ ద్వారా మరో ఇద్దరు సభ్యులను చేర్పిస్తే రూ.500 బోనస్‌తో పాటు రెండేళ్ల పాటు నెలకు రూ.2,500 అంటే రూ.60,000 సంపాదించుకోవచ్చు. కూర్చున్న దగ్గర మీ ఖాతాలోకి వచ్చి డబ్బు జమవుతుంద’ంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఆశజూపి దాదాపు రూ.3000 కోట్ల వ్యాపార మోసాలు చేసిన ఏడో తరగతి వరకే చదివిన హర్యానాకు చెందిన 34 ఏళ్ల రాధేశ్యామ్‌తో పాటు అతడికి సహకారం అందించిన సురేందర్‌ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. వీరి అరెస్టు రోజునే శుక్రవారం ఒక్కరోజే రూ.75 కోట్లు వీరి బ్యాంక్‌ ఖాతాలకు జమ అవడంతో అవాక్కైన సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మరింత మంది డబ్బులు జమ చేసే అవకాశం ఉండటంతో ఆ ఖాతాలు ఫ్రీజ్‌ చేయించారు. అలాగే ఆ కంపెనీ వెబ్‌సైట్‌ ఫ్యూచర్‌మేకర్‌.బిజ్‌ ఓపెన్‌ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మోసం గురించి సీపీ సజ్జనార్‌ దృష్టికి వచ్చిన వారంరోజుల్లోనే నిందితులను పట్టుకొని భారీ మోసం గుట్టురట్టు చేశారు.

మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌(ఎంఎల్‌ఎం)లో చేరాలంటే ఒకటికీ పదిసార్లు ఆలోచించేలా సైబరాబాద్‌ పోలీసులు చేసిన విస్తృత ప్రచారంతో ఇతర ఎంఎల్‌ఎం కంపెనీలపై ఫిర్యాదులు పొటెత్తుతున్నాయి. తమ వద్ద భారీగా డబ్బులు వసూలు చేశారంటూ ఇతర కంపెనీలపై కొంతమంది ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు.  

అప్పుడు దర్జీగా..ఇప్పుడు దర్జాగా 
హిస్సార్‌ జిల్లాలోని శిష్వాల్‌ గ్రామానికి చెందిన రాధేశ్యామ్‌ తన సోదరుడితో కలిసి దర్జీగా పనిచేశాడు. ఆ సంపాదన ఎటూ సరిపోకపోవడంతో తనకు వచ్చిన హిందీ భాషతో గుడ్‌వే, రైట్‌ కనెక్ట్‌ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ సంస్థల్లో అనతికాలంలోనే ఉన్నతస్థానానికి వెళ్లాడు. అదేదో సొంతంగా చేస్తే భారీ మొత్తంలో డబ్బులు వస్తాయన్న ఆశతో బన్సీలాల్, సురేందర్‌సింగ్‌లతో కలిసి 2015లో హిస్సార్‌లోని రెడ్‌ స్క్వేర్‌ మార్కెట్‌ ప్రాంతంలో ఎఫ్‌ఎంఎల్‌సీ కార్యాలయాన్ని తెరిచాడు. హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నిరుద్యోగులు, గృహిణులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు పార్ట్‌టైమ్‌ ఆదాయం పేరిట లక్షల్లో మందికి కుచ్చుటోపీ పెట్టారు. ఇలా రూ.కోట్లు చేతిలో మెదలడంతో స్వగ్రామంలో కోటలాంటి ఇంటిని నిర్మించాడు. అయితే గత ఆరు నెలల నుంచి అమీర్‌పేటలో కార్యకలాపాలు ప్రారంభించి ప్రసంగాలు ఇచ్చి వందలమందిని చేర్పించాడు. అయితే ఓ ప్రైవేట్‌ ఉద్యోగి అనుమానంతో సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో రాధేశ్యామ్‌ మోసాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement