ఆయన బయటకొస్తే సాక్ష్యాలు తారుమారు..! | gajal srinivas bail petition to be heard today | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 3 2018 10:21 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

gajal srinivas bail petition to be heard today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వొద్దని కోరుతూ నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు కౌంటర్ ధాఖలు చేశారు. గజల్ శ్రీనివాస్ బయటకు వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా పలువురిని విచారించాల్సి ఉందని తెలిపారు. ఇంకా ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలం రికార్డ్ చేయాల్సి ఉందని వివరించారు. నాంపల్లి కోర్టులో బెయిల్‌ కోసం గజల్‌ శ్రీనివాస్‌ లాయర్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. గజల్‌ శ్రీనివాస్‌ సమాజంలో మంచి పలుకుబడి గల వ్యక్తి అని, అతను బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు నివేదించారు. పూర్తి ఆధారాలతోనే గజల్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేశామని, అరెస్టుకు ముందు నోటీసులు ఇచ్చినా సరైన వివరణ ఇవ్వలేదని తెలిపారు.

మరోవైపు పోలీసులు కూడా గజల్‌ శ్రీనివాస్‌ను తమ కస్టడీకి అనుమతించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే, పోలీసుల కస్టడీకి అతన్ని అనుమతించే విషయమై వాదనలు ముగియడంతో కోర్టు తీర్పు గురువారానికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో ఏ-2గా ఉన్న కీలక నిందితురాలు పార్వతి పరారీలో ఉంది. గజల్‌ శ్రీనివాస్‌ పనిమనిషి అయిన పార్వతిని అదుపులోకి తీసుకుంటే గజల్‌ శ్రీనివాస్‌ లైంగిక వేధింపులకు సంబంధించి మరిన్ని కీలక వివరాలు రాబట్టే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే గజల్‌ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించినట్టు పోలీసులు చెప్తున్నారు.

తాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్న సంస్థలోని ఉద్యోగినిని లైంగికంగా వేధించిన కేసులో కేసిరాజు శ్రీనివాస్‌ అలియాస్‌ గజల్‌ శ్రీనివాస్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. బాధితురాలు పక్కా సాక్ష్యాలతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం బయటపడింది. ఈ కేసులో పార్వతి అనే మహిళను కూడా నిందితురాలిగా చేర్చినట్టు ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రవీందర్‌ మంగళవారం వెల్లడించారు. నాంపల్లి కోర్టులో నిందితుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్, పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లు బుధవారానికి వాయిదా పడ్డాయి. దీంతో గజల్‌ శ్రీనివాస్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఆఫీసులో మసాజ్‌ చేయాలంటూ..
పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన బాధిత మహిళ బీకాం, బ్యూటీషియన్‌ కోర్సులు పూర్తి చేయడంతో పాటు ప్రవచనాలు, వేదాలు అధ్యయనం చేసింది. ఈమెకు 2014లో వివాహమైనా మూడు నెలలకే విడాకులు తీసుకుంది. గతేడాది జూన్‌ నుంచి పంజగుట్ట పరిధిలోని సప్తగిరి బిల్డింగ్‌లో ఉన్న సేవ్‌ టెంపుల్‌ సంస్థలో నెలకు రూ.13 వేల జీతానికి పని చేస్తోంది. ఆ సంస్థ నిర్వహించే వెబ్‌ రేడియో ఆలయవాణికి ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వర్తిస్తోంది. వెలగపూడి ప్రకాశ్‌రావు నేతృత్వంలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మూడేళ్లుగా సప్తగిరి బిల్డింగ్‌లోని త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌లో నడుస్తోంది. ఈ సంస్థకు గజల్‌ శ్రీనివాస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి బాధితురాలు ఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకే విధులు నిర్వర్తించాల్సి ఉంది. అయితే గజల్‌ శ్రీనివాస్‌ తరచూ ఆ కార్యాలయానికి వెళ్లి అర్ధరాత్రి వరకు గడిపేవాడు. బాధితురాలిని కూడా ఆ సమయం వరకు ఉండాల్సిందిగా ఒత్తిడి చేసేవాడు.

ఇందుకు ఆమె గతంలోనే అనేకసార్లు సున్నితంగా తిరస్కరించింది. సేవ్‌ టెంపుల్‌ సంస్థలో బాధితురాలితో పాటు వీడియో ఎడిటర్, సహాయకుడు, పని మనిషి పార్వతి మాత్రమే ఉద్యోగులుగా ఉన్నారు. కార్యాలయానికి సంబంధించిన మూడు బెడ్‌రూమ్స్‌లో ఒకదాన్ని గజల్‌ శ్రీనివాస్‌ తన అనైతిక కార్యకలాపాలకు వినియోగించేవాడు. వేళకాని వేళల్లో పని మనిషి పార్వతితో కాళ్లు నొక్కించుకోవడం, మసాజ్‌ చేయించుకోవడంతోపాటు ఇతర అనైతిక కార్యకలాపాలకు పాల్పడేవాడు. పార్వతి మాదిరే తనకు ‘సహకరించాలంటూ’ శ్రీనివాస్‌ బాధితురాలిపై ఒత్తిడి చేసేవాడు. లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తానని, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడంతోపాటు మరెక్కడా ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరించేవాడు. పార్వతి సైతం గజల్‌ శ్రీనివాస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ బాధితురాలిపై అనేకసార్లు ఒత్తిడి తీసుకువచ్చింది. ‘‘నేను చేస్తున్నట్లే సార్‌కు చెయ్యి. అప్పుడే మంచి జీతంతో పాటు సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తాడు. ఆయన చాలా పెద్దోడు. నాకు చేసినట్లే నీకు పెళ్లి కూడా చేస్తాడు’’ అని చెప్పేది. ఈ వేధింపులు తారస్థాయికి చేయడంతో అనేకసార్లు తిరస్కరించిన బాధితురాలు.. కొన్ని సందర్భాల్లో పార్వతితో కలిసి రెండుమూడు గంటల పాటు గజల్‌ శ్రీనివాస్‌ కాళ్లు నొక్కేది. దీంతో మరింత రెచ్చిపోయిన గజల్‌ శ్రీనివాస్‌ ఆ గదిలో నగ్నంగా/అర్ధనగ్నంగా ఉండి బాధితురాలిని పార్వతి ద్వారా పిలిపించేవాడు. ఆమెను బలవంతంగా ఆలింగనం చేసుకోవడం, చేతులతో అభ్యంతరకరంగా తడమటం చేసేవాడు. వీటిని భరించలేకపోయిన బాధితురాలు హెచ్చరిస్తే... బెదిరింపులకు దిగేవాడు. ఫోన్‌ ద్వారా, వాట్సాప్‌ చాటింగ్స్‌ ద్వారానూ హింసించేవాడు.

బాధితురాలి స్టింగ్‌ ఆపరేషన్‌
గజల్‌ శ్రీనివాస్‌ వేధింపులు శృతిమించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితురాలు భావించింది. అయితే పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, కేవలం ఫిర్యాదు మాత్రమే చేస్తే ఎవరూ నమ్మరనే ఉద్దేశంతో స్వయంగా స్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. సేవ్‌ టెంపుల్‌ కార్యాలయంలో శ్రీనివాస్‌ వినియోగిస్తున్న బెడ్‌రూమ్‌లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇందులో గజల్‌ శ్రీనివాస్, పార్వతి రాసలీలలతోపాటు పార్వతితో కలిసి బాధితులురాలు శ్రీనివాస్‌ కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా గత శుక్రవారం (డిసెంబర్‌ 29) పంజగుట్ట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. వీడియో రికార్డులతోపాటు వాయిస్‌ రికార్డులు, ఫొటోలు పోలీసులకు అందించింది. దీంతో ఐపీసీ 354, 354 (ఏ), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విషయం గోప్యంగా ఉంచి ప్రాథమిక దర్యాప్తు చేశారు. అన్ని ఆధారాలు సేకరించి మంగళవారం ఉదయం ఆనంద్‌నగర్‌ కాలనీలోని తన నివాసంలో గజల్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement