
సాక్షి, హైదరాబాద్: పట్టపగలు నడిరోడ్డుపై రెండు గ్యాంగ్‌లు తలపడ్డాయి. పరస్పరం గొడవకు దిగి పిడిగుద్దులు విసురుకున్నాయి. ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుంటూ రెండు గ్యాంగ్‌లోని సభ్యులు పిచ్చిగా కొట్టుకున్నారు. నగరంలోని కాచిగూడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ లో నడిరోడ్డుపై ఈ గ్యాంగ్ వార్ తీవ్రస్థాయిలో జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను చూసి స్థానికులు, బస్తీవాసులు హడలిపోయారు. ఒక బైక్ విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది.
చిన్న గొడవగా మొదలై.. దాడులు, ప్రతి దాడులు, ఇటుకలు, రాళ్లతో కొట్టుకోవడం వరకు వెళ్లిందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై ఇరువర్గాలు కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. నడిరోడ్డుపై ఇంతపెద్ద గొడవ జరిగినా.. పోలీసులు పెట్టీ కేసు పెట్టి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ గ్యాంగ్‌వార్‌లో అంబర్‌పేట్‌కు చెందిన ముగ్గురు రౌడీషీటర్లు కూడా ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయి. ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు పోలీసులు కోరుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన కాచిగూడ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ బైక్ విషయంలో ఈ గొడవ జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో రౌడీషీటర్లు కూడా ఉన్నారన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఘటనలో రౌడీషీటర్లు ఎవరూ లేరని తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన ఇరువర్గాలు తిరిగి రాజీ చేసుకున్నారని, దీంతో పెట్టీ కేసు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment