ప్రతీకాత్మకచిత్రం
ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. చంద్రాపూర్ జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు మైనర్ గిరిజన బాలికలపై స్కూల్ సిబ్బంది లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికలపై లైంగిక దాడి జరిపిన హాస్టల్ సూపరింటెండెంట్ చబన్ పచారే, డిప్యూటీ సూపరింటెండెంట్ నరేంద్ర విరుట్కర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు సహకరించిన మహిళా సిబ్బంది అయిన హాస్టల్ వార్డెన్ కల్పనా ఠాక్రే, అసిస్టెంట్ లతా కనాకెలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
రజురా తెహిసిల్ పరిధిలో ఉన్న ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందినది కాగా, దీన్ని ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. లైంగిక దాడికి గురైన మైనర్ బాలికలు తరచూ అనారోగ్యానికి గురికావడంతో ఈనెల 6న చంద్రాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో వీరికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి జరిపినట్టు వెల్లడైంది.
మరో మైనర్ బాలిక కూడా అధికారులపై ఫిర్యాదు చేయడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై పోక్సో సహా ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ దారుణం వెలుగు చూసిన అనంతరం పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపును రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment