సెంట్రల్‌ వర్సిటీ; యువతుల దుస్తులు విప్పించి.. | Girls Stripped And Searched In Madhya Pradesh Sagar University | Sakshi
Sakshi News home page

వర్సిటీలో దారుణం; యువతుల దుస్తులు విప్పించి..

Published Mon, Mar 26 2018 10:33 AM | Last Updated on Mon, Oct 8 2018 3:19 PM

Girls Stripped And Searched In Madhya Pradesh Sagar University - Sakshi

వీసి నివాసం ముందు గుమ్మికూడిన విద్యార్థినులు(ఇన్‌సెట్‌లో సాగర్‌ యూనివర్సిటీ ప్రధాన భవనం)

సాగర్‌: లేడీస్‌ హాస్టల్‌ ఆవరణలో వాడి పారేసిన శానిటరీప్యాడ్‌ను చూసిన వార్డెన్‌ కోపంతో రగిలిపోయింది. గదుల్లో నుంచి అమ్మాయిలందరినీ పిలిపించి, వరుసగా నిలబెట్టి దుస్తులు విప్పించింది. ఆ శానిటరీ ప్యాడ్‌ వాడింది ఎవరో చెప్పాలంటూ లోదుస్తులను సైతం పరిశీలించేప్రయత్నం చేసింది. అవమానభారంతో వెక్కివెక్కి ఏడ్చిన విద్యార్థినులు చివరికి వీసికి ఫిర్యాదు చేశారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ యూనివర్సిటీలో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ పట్టణంలోగల హరిసింగ్‌ గౌర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ.. స్వాతంత్ర్యానికి పూర్వమే ఏర్పాటైన విద్యాసంస్థల్లో ఒకటి. దీనిని సాగర్‌ యూనివర్సిటీగా వ్యవహరిస్తారు. వర్సిటీ ఆవరణలోని రాణి లక్ష్మీబాయి హాస్టల్‌లో 40 మందికిపైగా విద్యార్థినులు ఉంటున్నారు. శనివారం హాస్టల్‌ను తనిఖీచేసిన వార్డెన్‌.. వాడిపారేసిన శానిటరీ ప్యాడ్‌ పడిఉండటాన్ని చూసి కోపంతో చిందులేసింది. తన సహాయకురాలితో కలిసి అమ్మాయిలందరినీ తనిఖీచేసింది. ఈక్రమంలోనే విద్యార్థినుల దుస్తులు విప్పించింది. ఆ మరుసటిరోజే విద్యార్థినులంతా కలిసి సదరు వార్డెన్‌ తీరుపై వీసీకి ఫిర్యాదుచేశారు. తక్షణమే వార్డెన్‌ను, సహాయకురాలిని తొలగించాలని డిమాండ్‌ చేశారు.

పరిశీలిస్తున్నాం: వీసీ తివారీ
విద్యార్థినుల ఫిర్యాదు అందిందని, జరిగిన సంఘటనకు సంబంధించి నిజానిజాలను పరిశీలిస్తున్నామని, ఎవరు తప్పు చేసినట్లు తేలినా తీవ్ర చర్యలు తీసుకుంటామని సాగర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఆర్‌పీ తివారీ మీడియాతో అన్నారు. కాగా, జరిగిన అవమానకర ఘటన గురించి మీడియాతో మాట్లాడేందుకు విద్యార్థినులు విముఖత ప్రదర్శించారు. దీనిపై ఇప్పటివరకు పోలీసు కేసు నమోదు కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement