మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి, కుటుంబసభ్యులు.., ఇన్‌సెట్లో దొంగరి ప్రసన్నకుమార్ (ఫైల్)
సాక్షి, గోదావరిఖని(రామగుండం): వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ఆ ఇంటికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న వ్యక్తి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖని ఎల్‌బీనగర్‌లో నివాసముండే సమ్మయ్య సింగరేణిలో పనిచేసి చాలా ఏళ్ళ క్రితమే పదవీ విరమణ పొందాడు. ఈయనకు కుమారులు ప్రసన్నకుమార్ (35), రాహూల్‌తో పాటు కుమార్తె ఉన్నారు. ప్రసన్నకుమార్ స్థానికంగా వీడియోగ్రాఫర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి కేబుల్ నెట్‌వర్క్ నిర్వహించేవాడు.
పదేళ్ళక్రితం కెమెరామెన్‌గా టీవీ చానెల్‌కు పనిచేసి ఆ తర్వాత మెదక్‌జిల్లాకు ఓ టీవీకి రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. రాహూల్ స్థానికంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మే 6వ తేదీన సోదరుడు రాహూల్ వివాహానికి సంబంధించి పెళ్లి కార్డులు పంచేందుకు హైదరాబాద్ వెళ్ళిన ప్రసన్నకుమార్ తిరుగుప్రయాణంలో సిద్దిపేట జిల్లా కొండపాక వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో ఆ కుటుంబానికి ప్రసన్నకుమార్ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నాడు.
సోదరుడి వివాహాన్ని సైతం ఆయన స్వయంగా దగ్గరుండి చేసే క్రమంలో మృత్యువాత పడడం ఆ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. శనివారం తెల్లవారుజామున మృతదేహాన్ని గోదావరిఖనికి తీసుకురాగా వివిధ పత్రికలు, టీవీ చానెళ్ళకు చెందిన జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, క్రీడాకారులు, ప్రముఖులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. గోదావరినది ఒడ్డున అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment