
ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌టీం, దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తున్న పోలీసులు
డోన్ రూరల్ :పట్టణంలోని ఇందిరానగర్‌కాలనీలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చొరబడి 60 తులాల బంగారు ఆభరణాలు, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల మేరకు..కాలనీలో నివాసముంటున్న గోపాల్‌శర్మ మల్కాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పాఠశాలకు సెలవులు రావడంతో ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా కుమార్తెను చూసేందుకు గురువారం హైదరాబాద్ వెళ్లాడు. ఆ తర్వాత విజయవాడలో సమీప బంధువు రిటైర్మెంట్ ఫంక్షన్‌కు హాజరయ్యారు.
ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని దుండగులు ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తలుపులు బలవంతంగా తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఆదివారం ఉదయం గోపాల్‌శర్మ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చాడు. అయితే తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి కిటికీలో తొంగి చూడగా బీరువాలో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగినట్లు అనుమానించి పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ రాజగోపాల్‌నాయుడు, ఎస్‌ఐ.చంద్రబాబునాయుడు అక్కడికి చేరుకుని బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment