సాక్షి, షాద్‌నగర్: మాయమాటలు చెప్పి వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న రాజ్యలక్ష్మి(58) అనే వృద్ధురాలు హైదరాబాద్‌కు వెళ్లి సోమవారం రాత్రి తిరిగి షాద్‌నగర్ బస్టాండ్‌కు చేరుకుంది.
రాజ్యలక్ష్మి బస్ దిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె వద్దకు వెళ్ళి ఆమెతో మాటలు కలిపి తాము పోలీసులమని పరిచయం చేసుకున్నారు. బస్టాండ్‌లో దొంగతనాలు ఎక్కువగా ఉన్నాయి.. మెడలో బంగారు ఆభరణాలు వేసుకొని వెళితే ప్రమాదమని హెచ్చరించారు. మెడలో ఉన్న బంగారు ఆభరణాలను బ్యాగులో పెట్టుకొని వెళ్లాలని సూచించారు. వారి మాటలు నమ్మిన రాజ్యలక్ష్మి మెడలో ఉన్న ఆభరణాలు బ్యాగులో పెట్టుకుంటుండగా జాగ్రత్తగా ఇలా పెట్టుకోవాలి అని నమ్మబలుకుతూ ఆమెకు తెలియకుండానే ఆభరణాలను తస్కరించారు.
ఇంటికి వెళ్లి బ్యాగు చూసుకున్న ఆమెకు బంగారు ఆభరణాలను కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆభరణాలు 7 తులాల వరకు ఉంటుందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.