బూచాడు.. చిక్కాడు | Gold Robbery From Childrens in Hyderabad | Sakshi
Sakshi News home page

బూచాడు.. చిక్కాడు

Published Sat, Mar 2 2019 9:45 AM | Last Updated on Sat, Mar 2 2019 9:45 AM

Gold Robbery From Childrens in Hyderabad - Sakshi

సీసీ పుటేజీల్లో నిందితుడు ఇస్మాయిల్‌(ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: ఒంటరిగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులే అతడి టార్గెట్‌... పరిచయస్తుడినంటూ మాట కలిపి అదును చూసుకుని వారి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు కాజేస్తాడు... తొమ్మిదేళ్లుగా నేరాలు చేస్తున్న ఇతడిపై ఇప్పటి వరకు 22 కేసులు ఉన్నాయి... హైదరాబాద్, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులకు మూడేళ్లుగా మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాడు... ఈ నేరగాడిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల చాకచక్యంగా పట్టుకున్నట్లు కొత్వాల్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా, ఉమర్గాకు చెందిన షేక్‌ ఇస్మాయిల్‌ బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చి జహీరాబాద్‌లోని శాంతినగర్‌లో ఉంటూ కూలీ పనులు చేసే వాడు. మద్యం, కల్లు తదితర వ్యసనాలకు బానిసైన అతడికి వస్తున్న ఆదాయం చాలకపోవడంతో నేరాల బాట పట్టాడు. పెద్దవాళ్లను, ఇళ్లనో టార్గెట్‌గా చేసుకుంటే దొరికే అవకాశం ఉందని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అభంశుభం తెలియని చిన్నారుల నుంచే దోచుకోవాలని భావించాడు.

ఏదైనా ఓ ప్రాంతాన్ని ఎంచుకునే ఇస్మాయిల్‌ అక్కడ సైకిల్‌పై మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు నివసించే ప్రాంతాల్లో సంచరిస్తుంటాడు. ఒంటరిగా పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులను గుర్తించి టార్గెట్‌ చేస్తాడు. ఆపై సైకిల్‌ను దూరంగా ఉంచి వారి వద్దకు వెళ్లే ఇస్మాయిల్‌ ‘మీ నాన్న స్నేహితుడిని’ అంటూ పరిచయం చేసుకుంటాడు. తాను గోల్డ్‌స్మిత్‌నని చెబుతూ మీ ఒంటిపై ఉన్న గొలుసులు/చెవి కమ్మిలు/కాళ్ల పట్టీలు/ఉంగరాలు మార్చి కొత్తవి, పెద్దవి చేయమని మీ నాన్న చెప్పారని, అందుకే వచ్చానంటూ ఎర వేస్తాడు. నిజమేనని నమ్మే ఆ చిన్నారులు తమ ఒంటిపై ఉన్నవి తీసి ఇచ్చేయడమో, తీసుకోవడానికి అంగీకరించడమో చేస్తారు. ఇక్కడే ఉంటే పది నిమిషాల్లో ఇవి మార్చి కొత్తవి తీసుకువస్తానంటూ వెళ్లి ఉడాయిస్తాడు. ఇదే పంథాలో 2010 నుంచి 2015 వరకు సనత్‌నగర్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌ల్లో 9 నేరాలు చేశాడు. 2015 మేలో ఇస్మాయిల్‌ను పట్టుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు జైలుకు తరలించారు.

చర్లపల్లి జైల్లో ఏడు నెలలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా ఇస్మాయిల్‌లో మార్పురాలేదు. 2016 నుంచి మళ్లీ అదే పంథాలో నేరాలు మొదలెట్టి కాచిగూడ, చిక్కడపల్లి, ఛత్రినాక, ఆసిఫ్‌నగర్, అంబర్‌పేట్, జగద్గిరిగుట్ట, మార్కెట్, సైఫాబాద్, గాంధీనగర్‌ల్లో మరో 13 నేరాలు చేశాడు. రికార్డులకు ఎక్కనివి మరో పది వరకు ఉంటాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు మూడేళ్లుగా అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. దీంతో ఇస్మాయిల్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్‌ రవి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు శేఖర్, శ్రీకాంత్, ఈశ్వర్‌రావు రంగంలోకి దిగారు.

నేరాలు జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను సేకరించి అధ్యయనం చేయగా పాత నేరగాడైన ఇస్మాయిల్‌ పనిగా తేలింది. అయితే పోలీసులకు చిక్కిన ప్రతిసారీ ఇతడు తన మకాం మారుస్తుంటారని గుర్తించారు. దీంతో ముమ్మరంగా గాలించిన ప్రత్యేక బృందం శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడి నుంచి 20 జతల చెవి కమ్మిలు, తొమ్మిది జతల కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం అతడిని గాంధీనగర్‌ పోలీసులకు అప్పగించారు. ఇస్మాయిల్‌పై పీడీ యాక్ట్‌ నమోదుకు ఉన్న అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement