బెట్టింగులు.. అప్పులు.. ఆపై దోపిడీ బాట | Gold Robbery Gang Arrest In Visakhapatnam | Sakshi
Sakshi News home page

బెట్టింగులు.. అప్పులు.. ఆపై దోపిడీ బాట

Published Tue, Oct 9 2018 7:18 AM | Last Updated on Fri, Oct 12 2018 12:59 PM

Gold Robbery Gang Arrest In Visakhapatnam - Sakshi

విశాఖ క్రైం: బంగారం వ్యాపారిపై పక్కాగా రెక్కీ నిర్వహించి... అదునుచూసి కంట్లో కారం జల్లి నగదు, బంగారం దోచుకుపోయిన ముఠాలోని పది మంది నిందితులను నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో అయిదుగురు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 598.67 గ్రాముల బంగారం, రూ.15.79 లక్షల నగదు, ఒక ఫిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. దొండపర్తి డీఆర్‌ఎం కార్యాలయం రోడ్డులో సెప్టెంబర్‌ 23న వేకువజామున 4.45 గంటల సమయంలో బంగారం వ్యాపారిని ఫిస్టల్‌తో బెదిరించి... కంట్లో కారం జల్లి అతని వద్ద నుంచి 1200 గ్రాముల బంగారం, రూ.42 లక్షల నగదు ఓ ముఠా దోచుకుపోయిన ఘటన తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో నగరంలో సంచలనం రేపింది. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల విజువల్స్‌తో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మహేష్‌ చంద్ర లడ్డా వెల్లడించారు.

అప్పులు తీర్చుకునేందుకు దోపిడీబాట
మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన గోగాడ గోవింద్‌ గతంలో నగరంలోని రెండు బంగారు దుకాణాల్లో కొంతకాలం పనిచేశాడు. అనంతరం క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ సుమారు రూ.5.5లక్షల వరకూ అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా బంగారం వ్యాపారి రమేష్‌పై గోవింద్‌ దృష్టి సారించాడు. విశాఖ నగరంలోని శ్రీనగర్‌లో సాయి ఫ్యారడైజ్‌ అపార్టుమెంట్‌ ఐదో అంతస్తులో నివసిస్తున్న రమేష్‌ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తురులో ఉంటూ వ్యాపారం నిమిత్తం విశాఖ వచ్చి వెళ్తుంటాడు. రమేష్‌ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వర్రి సురేష్‌తో తనకున్న స్నేహాన్ని వినియోగించుకుని ఎప్పటికప్పుడు రమేష్‌ కదలికలను గోవింద్‌ తెలుసుకునేవాడు. ఆ క్రమంలో గతంలో రెండుసార్లు చోరీకి యత్నించి విఫలమయ్యాడు. చివరకు ఓ ముఠాను తయారు చేయాలని భావించి ఖరగ్‌పూర్‌కు చెంది నగరంలో స్థిరపడిన సాది హరిబాబు అలియాస్‌ పికిరితో మాట్లాడి ప్రణాళిక సిద్ధం చేశాడు. అందులో భాగంగా నగరంలోని కొందరితో ముఠా ఏర్పాటు చేయడంతోపాటు ఖరగ్‌పూర్‌ నుంచి మరో ఐదుగురిని తీసుకొచ్చే బాధ్యతను పికిరికి అప్పగించాడు.

ఫిస్టల్‌తో బెదిరించి... కంట్లో కారంజల్లి
దోపిడీకి ముందు రోజు సెప్టెంబర్‌ 22న ఖరగ్‌పూర్‌ నుంచి చేరుకున్న ఐదుగురితో కలిసి మొత్తం 15 మంది నిందితులూ కలిసి వ్యాపారి రమేష్‌ ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. ఆ మరుసటి రోజు వేకువజామున 4 గంటల ప్రాంతంలో కొందరు నిందితులు మూడు బైక్‌లపై రమేష్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌కు రమేష్‌ బైక్‌పై వెళ్తుండగా సాయికిరణ్, చిన్నతో పాటు మరో ఐదుగురు వెంబడించారు. దొండపర్తి ఫ్లైవర్‌ వంతెన వద్దకు చేరుకునేసరికి ఒక్కసారిగా ముట్టడించారు. అప్పటికే ఆ ప్రాంతంలో మాటువేసి ఉన్న ఖరగ్‌పూర్‌కు చెందిన ముఠా సభ్యులు ఫిస్టల్‌తో బెదిరించడంతో చిన్న అనే వ్యక్తి రమేష్‌ కంట్లో కారం జల్డాడు. వెంటనే రమేష్‌ చేతిలోని సూటు కేసు, బ్యాగ్‌లో ఉన్న బంగారంతో ప్రధాన నిందితుడు గోవింద్, మిగిలిన వారంతా పరారయ్యారు. అనంతరం ఒకచోటకు చేరుకున్నక బంగారం, నగదు పంచుకున్నారు. ఖరగ్‌పూర్‌కు చెందిన ముఠా సభ్యులు తమకు వచ్చిన వాటాలో నుంచి రూ.2.3లక్షలతోపాటు ఫిస్టల్‌ను తమను నగరానికి తీసుకొచ్చిన సాది హరిబాబుకు ఇచ్చి వెళ్లిపోయారు. తేరుకున్న రమేష్‌ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరా విజువల్స్‌ను పరిశీలించారు. అదేవిధంగా కానిస్టేబుల్‌ రమేష్‌రెడ్డి సేకరించిన కీలక ఆధారాలతో పది మంది నిందితులను ద్వారకానగర్‌ సమీపంలో అరెస్ట్‌ చేశారు. ఖరగ్‌పూర్‌కు చెందిన మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారు పట్టుబడితే మరికొంత బంగారం, నగదు రకవరీ చేసే అవకాశం ఉంది. నిందితులను పట్టుకోవడంతో చురుగ్గా వ్యవహరించిన రమేష్‌రెడ్డితోపాటు ఇతర సిబ్బందిని సీసీ అభినందించి రివార్డులు అందించారు. సమావేశంలో క్రైం డీసీపీ దామోదర్, ఏడీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ గోవింద్‌రావు, సీఐ కృష్ణారావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు

10 మంది నిందితుల అరెస్ట్‌
మద్దిలపాలెంకు చెందిన గోగాడ గోవింద్‌రావు(అలియాస్‌ గోగు, విందు), కొయిలాడ సాయికిరణ్‌ (అలియాస్‌ రాజా, రెబల్‌), సాది హరిబాబు, మానాపురం మురళీకృష్ణ, పాలా భాస్కర్‌ (అలియాస్‌ భాషా), కొండపు ఢిల్లేశ్వరరావు (అలియాస్‌ ఢిల్లీ), కండ్రపు సౌమిత్,(అలియాస్‌ గోవింద్, ఆలియాస్‌ గోవి), సాలిపేటకు చెందిన సూర హరిదీక్షిత్‌రావు, తోటాడ లోకేష్, పశ్చిమ బెంగాల్‌ రాష్టం, ఖరగ్‌పూర్‌కు చెందిన మొద్దు తారకేశ్వరరావు(అలియాస్‌ చిన్నా)లను అరెస్ట్‌ చేశారు. ఖరగ్‌పూర్‌కు చెందిన మనోజ్‌దాస్, గణశ్యామ్, సుమీర్‌దాస్, గేదం సూరజ్‌కుమార్, రాకేష్‌ మండా పరారీలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement