నర్సీపట్నం: పట్టణంలోని శివపురంలో భారీ దొంగతనం జరిగింది. ఇంటి యజమాని కుటుంబ సభ్యులతో సహా స్వగ్రామానికి వెళ్లాడాన్ని గమనించిన దొంగలు ఇంట్లో ప్రవేశించి సుమారు రూ.8 లక్షలు విలువైన బంగారం, వెండి నగలను దోచుకుపోయారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...నర్సీపట్నం–కేడీ పేట వెళ్లే ప్రధాన రహదారి శివపురం వద్ద అయ్యంకుల వేణుగోపాల్ నివాసం ఉంటున్నాడు. గత నెల 31న ఇంటికి తాళాలు వేసుకుని స్వగ్రామమైన కృష్ణాదేవిపేటకు కుటుంబ సభ్యులతో సహా వెళ్లాడు. ఈ నెల 2న తిరిగి ఇంటికి రాగా ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తీసి ఉండడాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. బీరువా లాకర్ తాళాలు సైతం తీసి ఉన్నాయి.
బీరువాలోని దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లాకర్ చూడగా అందులో భద్రపరిచిన 20 తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులు లేవు. లాకర్‌లో ఉన్న ఎనిమిది తులాల నల్లపూసల దండ, నాలుగు తులాల చంద్రహారం, రెండు తులాల నక్లెస్, మూడు తులాల గొలుసు, రెండు తులాల మండచైన్, అరతులం పగడపు ఉంగరం, పది తులాల వెండి గ్లాసులు, పది తులాల వెండి పట్టీలు చోరీకి గురైనట్టు బాధితులు వేణుగోపాలు, భార్య దేవి తెలిపారు. బాధితులు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ ఎస్.సింహాద్రినాయుడు సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment