శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు@బంగారం స్మగ్లింగ్‌ | Gold Smuggling at Shamshabad Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు@బంగారం స్మగ్లింగ్‌

Published Wed, May 9 2018 2:10 AM | Last Updated on Thu, Aug 2 2018 4:08 PM

Gold Smuggling at Shamshabad Airport  - Sakshi

బొమ్మల మాటున మహిళా ప్రయాణికురాలు తీసుకొచ్చిన బంగారు రేకులు

శంషాబాద్‌: దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కేంద్రంగా బంగారం అక్రమ రవాణా చేస్తున్న భారీ స్మగ్లింగ్‌ ముఠా డొంక కదిలింది. ఈ నెల 4న ఈకే 528 విమానంలో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికురాలి సమాచారంతో ముఠా గుట్టును కస్టమ్స్‌ అధికారులు రట్టు చేశారు. అదే విమానంలో వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిపై అనుమానంతో అధికారులు ఆమె లగేజీ తనిఖీ చేశారు. లగేజీలో బొమ్మలు, వ్యక్తిగత వస్తువులు మాత్రమే ఉండటంతో మరింత లోతుగా తనిఖీలు చేపట్టారు.

బొమ్మలు ఉన్న బాక్స్‌ను స్కానింగ్‌ చేయగా కార్బన్‌ కాగితాల వెనక కార్డ్‌బోర్డుకు మధ్య బంగారాన్ని రేకులుగా మార్చి అమర్చిన విషయాన్ని గుర్తించారు. సుమారు 1,100 గ్రాముల  బంగారాన్ని  స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా.. తనకు ప్రయాణ చార్జీలతో పాటు ఉపాధి కల్పిస్తామని చెప్పడంతోనే బంగారాన్ని తీసుకువచ్చానని  తెలిపింది. దుబాయ్‌లో బంగారం అప్పగించిన వ్యక్తి తన ఫొటో తీసుకుని హైదరాబాద్‌కు సమాచారం అందించినట్లు మహిళ వివరించింది. దీంతో కస్టమ్స్‌ అధికారులు శంషాబాద్‌ జోన్‌ పోలీసులతో కలసి ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి స్మగ్లర్లను ఎయిర్‌పోర్టులో 2 రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. 

అదుపులో ఏడుగురు.. 
తొలిసారి ప్రయాణించే మహిళలతో పాటు ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారిని కూడా ఈ ముఠా వలలో వేసుకుని వారి ద్వారా బంగారాన్ని అక్రమం గా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్‌ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠాకు సంబంధించిన ఆరుగురు వ్యక్తులు శంషాబాద్‌ ఎయి ర్‌పోర్టులోనే ఉంటున్నారు. ప్రయాణికుల ద్వారా వచ్చిన పార్సిళ్లను సమీపంలోని హోటళ్లకు తీసుకెళ్లి అక్కడి నుంచి నలుగురు వ్యక్తులు కేరళ తీసుకెళ్లి అక్కడి నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు.. మరో ఇద్దరు వ్యక్తులు నేరుగా హైదరాబాద్‌ నుంచే ముంబైకి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆరుగురితో పాటు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. వారం రోజుల్లో 5 పార్సిళ్లను ముంబైకి తరలించినట్లు నిందితులు వెల్లడించినట్లు సమాచారం.  

సిబ్బంది పాత్ర సైతం.. 
ఈ నెల మొదటి వారంలో మరో 2 బంగారం అక్రమ రవాణా ఘటనలు జరిగినట్లు కస్టమ్స్‌ అధికారులు మంగళవారం వెల్లడించారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఈకే 528 విమానంలోని చెత్తను తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో వాటిని స్కానింగ్‌ చేశారు. అందులో టేప్‌లతో చుట్టి ఉన్న ఓ ప్యాక్‌లో 615 గ్రాముల బరువున్న 5 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.19 లక్షలు ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ నెల 3న రాత్రి 12 గంటల సమయంలో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సిబ్బంది ఒకరు పార్సిళ్లను ఏరో బ్రిడ్జి సమీపంలో పడేసి అక్కడే అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎయిర్‌ ఇండియా అధికారి అతడిని ప్రశ్నించగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్కాన్‌ ఏవియేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ తరఫున ఇండిగో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సిబ్బందిగా పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. అతడు పడేసిన పార్సిళ్లను చూడగా 1,632 గ్రాముల బంగారం బయటపడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement