మృతి చెందిన శేఖర్‌బాబు ,పెళ్లి పత్రికలు
రెండ్రోజుల్లో పెళ్లి... ఆ ఇంట్లో సందడే సందడి... సంబరాలు అంబరాన్నంటాయి... బంధువులు వచ్చేశారు... వివాహ పనులు ఊపందుకున్నాయి... ఇలాంటి తరుణంలో తీరని విషాదం చోటుచేసుకుంది... పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన కాబోయే వరడు అందరినీ విడిచి.. తిరిగిరాని లోకాలకు వెళ్లాడు... కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖ సాగరంలో మునిగారు.
కడప, లింగాల : మండలంలోని దొండ్లవాగు గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో కాబోయే పెళ్లి కుమారుడు దుర్మరణం చెందాడు. వివరాలలోకి వెళితే.. పులివెందుల పట్టణంలోని క్రిష్టియన్‌లైన్‌కు చెందిన గుడిసె మరియమ్మ, సంరాజుల కుమారుడు శేఖర్‌బాబు(25). ఈయనకు జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. వీరి పెళ్లి ఈ నెల 17న పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో జరగాల్సి ఉంది. బంధువులను పిలిచేందుకు పెళ్లి పత్రికలను తీసుకొని పులివెందుల నుంచి మోటారుసైకిల్‌పై సింహాద్రిపురం వెళ్లాడు. సింహాద్రిపురం వైపు నుంచి పులివెందులకు స్కూటీపై నక్కలపల్లెకు చెందిన అజయ్‌కుమార్‌రెడ్డి వస్తున్నాడు.
ఎదురెదురుగా వస్తున్న– వెళ్తున్న ఈ రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. బైక్‌పై వెనుకవైపు కూర్చొని ఉన్న శేఖర్‌బాబు ఎగిరిపడి తల రోడ్డుకు బలంగా తాకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న ఏసు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అజయ్‌కుమార్‌రెడ్డికి స్వల్ప గాయాలు కావడంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శేఖర్‌బాబు మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
పెళ్లింట్లో విషాద ఛాయలు
రెండు రోజుల్లో శేఖర్‌బాబు వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మృతి చెందడంతో ఆయన ఇంటితోపాటు క్రిష్టియన్‌లైన్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శేఖర్‌బాబు మృతదేహాన్ని చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.
పరామర్శించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి
ఘటనా స్థలానికి వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ భాస్కర్‌రెడ్డి చేరుకుని శేఖర్‌బాబు మృతదేహాన్ని సందర్శించారు. మృతి చెందడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పులివెందుల ఏరియా ఆసుపత్రిలో ఉన్న శేఖర్‌బాబు మృతదేహాన్ని వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి పరిశీలించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment