
కాల్పులు జరుపుతున్న వ్యక్తిని అడ్డుకుంటున్న పోలీసులు. నిందితుడు గజరాజ్‌సింగ్
హైదరాబాద్: చర్లపల్లిలోని ఈసీనగర్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కూరగాయల మార్కెట్‌లో నెలకొన్న స్థల వివాదంలో స్థానికులతో ఘర్షణ పడ్డ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, కుషాయిగూడ ఏసీపీ కృష్ణమూర్తి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు.
సంతలో స్థలంకోసం...
నెహ్రూనగర్‌కు చెందిన దండు తులసీదాస్, మరో ముగ్గురు వ్యక్తులు, మర్రి గూడలో నివసించే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బబ్లూ, ధర్మేంద్ర అనే సోద రులు చర్లపల్లి ఈసీనగర్ మెయిన్‌రోడ్డులో వ్యాపారం చేసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం సంతలో స్థలంకోసం ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. బబ్లూ, ధర్మేంద్రలు ఘర్షణ విషయాన్ని తండ్రి గజరాజ్‌సింగ్‌కు ఫోన్‌లో తెలిపారు. దీంతో ఆగ్రహంతో ఈసీనగర్ చేరుకున్న గజరాజ్‌సింగ్ తన వెంట తీసుకువచ్చిన నాటు తుపాకీతో తులసీదాస్ వర్గీయులను కాల్చేందుకు సిద్ధపడ్డాడు.
అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది ఇరు పక్షాలను చెదరగొట్టారు. అదే సమయంలో గజరాజ్‌సింగ్ తన తుపాకీని తులసీదాసుకు గురిపెట్టడాన్ని పసిగట్టిన కానిస్టేబుల్ చక్రపాణి చాకచక్యంగా వ్యవహరించి తుపాకీని పక్కకు తోయడంతో అది గాలిలోకి పేలింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గజరాజ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకొని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత గజరాజ్‌సింగ్ ఇంటికి వెళ్లి సోదా చేయగా రెండు బుల్లెట్లు, ఓ తల్వార్ లభ్యమయ్యాయి. ఈ సంఘటనలో గాయపడ్డ తులసీదాస్‌తో పాటు శంకర్, చంద్రశేఖర్, పవన్‌లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment