నిందితుడు ఆకాశ్ చౌదరీ
గుర్‌గాం: అనుమతి లేకుండా సామాజిక మాధ్యమాల్లోని ఫోటోలతో ఆన్‌లైన్ బిజినెస్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్‌బుక్, ఇస్టాగ్రామ్‌లలో కొత్తవారికి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టడం, వారు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే వాళ్ల అకౌంట్‌లోని ఫోటోలను డౌన్‌లోడ్ చేసి వాటితో కొత్తగా ప్రొఫైల్ క్రియేట్ చేయడం, ఆ తర్వాత అందమైన అమ్మాయిల ఫోటోలతో క్రియేట్ చేసిన ప్రొఫైల్‌తో మగవాళ్లకు చాటింగ్‌తో ఎరవేసి, తన మొబైల్ వాలెట్‌లోకి డబ్బులు పంపించమని అడగటం..ఇది గుర్‌గావ్‌కి చెందిన అకాశ్ చౌదరీ అనే వ్యక్తి రోజూ చేస్తున్న పని. ఇలా ముంబైకి చెందిన ఓ వ్యాపారి ద్వారా రూ.70 వేలు ద్వారా తన మొబైల్ వాలెట్‌లోకి పంపించుకున్నాడు.
ఇలా సేకరించిన యువతుల ఫోటోలను చిన్న చిన్న కంపెనీల ప్రొడక్టులను ప్రొమోట్ చేయడానికి కూడా ఇతగాడు అమ్ముకున్నట్లు ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి చిన్మయ్ బిజ్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు. డిగ్రీ వరకు చదివిన ఆకాశ్ చౌదరీ గతంలో కాల్‌సెంటర్‌లో పనిచేశాడు. అతను క్రియేట్ చేసిన ఫేక్ ప్రొఫెల్‌కి 10లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.
ఢిల్లీలోని లజపత్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన చిత్రాలు ఇస్టాగ్రామ్‌లో దర్శనం ఇవ్వడం, అలాగే తన పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి కొన్ని బ్రాండులకు ప్రొమోట్ చేయడం గుర్తించిండంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే చాలా వెబ్‌సైట్లలో ఆమె అనుమతి లేకుండా ఆమె ఫోటోలతో ప్రొడక్టులను ప్రొమోట్ చేసుకుంటున్నట్లు ఆమె గుర్తించింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు విచారణలో గుర్‌గావ్‌కు చెందిన ఆకాశ్ చౌదరీ ఈ విధంగా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇదంతా చేస్తున్నట్లు గుర్తించారు. అతని నుంచి మొబైల్ ఫోన్, లాప్‌ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు.
2016 నుంచి ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి అడ్వర్టైజ్ మెంట్ల ద్వారా తేలికగా డబ్బులు సంపాదిస్తున్నాడని పోలీసులు తెలిపారు.ఆకాశ్ చౌదరీని భారత శిక్షా స్మృతిలోని 9 ఉల్లంఘనల కింద అరెస్ట్ చేశారు. ఆకాశ్ చౌదరీ ఈ విధంగా సుమారు 20 మందిని మోసగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు యువతుల ఫోటోలను పోర్న్ వెబ్‌సైట్లలో కూడా అప్‌లోడ్ చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment