మృతి చెందిన విద్యార్థిని ఎస్తేరురాణి(ఫైల్) సంఘటన స్థలంలో స్థానికులు, బంధువులు
విశాఖపట్నం, డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలోని గిరిజన సంక్షేమశాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాంగి ఎస్తేరు రాణి(14) శుక్రవారం ఉదయం సమీపంలోని గెడ్డలో స్నానానికి దిగి మునిగిపోయి చనిపోయింది. గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవు కావడంతో తోటి విద్యార్థినులతో కలిసి పాఠశాలకు దగ్గరలో ఉన్న గెడ్డకు దుస్తులు ఉతుక్కోడానికి వెళ్లింది. అనంతరం స్నానానికి దిగి ప్రమాదానికి గురైంది. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గెడ్డ లోతుగా ఉండడంతో విద్యార్థిని బయటకు రాలేకపోయింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మండలంలోని గుం టసీమకు చెందిన ఎస్తేరు లక్ష్మీపతికి ఇద్దరు మగ పిల్లలు, అమ్మాయి ఉన్నారు. ఆరు నెలల కిందట అతని భార్య చనిపోయింది. కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
పాఠశాలకు ప్రహరీలేకపోవడం వల్లే..
పాఠశాల ప్రహరీ పూర్తిగా శిథిలమైంది. పాఠశాలలో మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతోవిద్యార్థినులు గుంపులు గుంపులుగా సమీపంలోని గెడ్డకు వెళుతుంటారు. పాఠశాల సిబ్బంది పట్టించుకోనితనం కూడా ఉంది. రోజూ మాదిరి శుక్రవారం కూడా గెడ్డలో దిగిన విద్యార్థిని రాణి గల్లంతయింది. తోటి విద్యార్థినులు పరుగున పాఠశాలకు వచ్చి చెప్పడంతో ఉపాధ్యాయులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రాత్రి 7గంటలకు మృతదేహాం లభ్యమైంది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని విద్యార్థిని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనతో పాఠశాలతోపాటు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
పట్టించుకోని ఉన్నతాధికారులు..
విద్యార్థిని ఉదయం 8గంటల సమయంలో గెడ్డల పడి మృతి చెందింది. పాడేరు ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమశాఖ డీడీ, విద్యాశాఖ ఉన్నతాధికారులు సాయంత్రం వరకు ఈ సంఘటన పై పట్టించుకోలేదన్న వాదన వ్యక్తమవుతోంది. గిరిజన విద్యార్థులంటే ఉన్నతాధికారులకు చులకన అని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబీకులు ఈ సంఘటనపై ఉపాధ్యాయులను నిలదీశారు. స్థానిక ఎస్‌ఐ హిమగిరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment