సమావేశంలో మాట్లాడుతున్న సీఐలు బాజీజాన్ సైదా, దుర్గాప్రసాద్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నిషేధిత గుట్కా, ఖైనీలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి రహస్యంగా నెల్లూరులోని పలు ప్రాంతాల్లో దుకాణదారులకు విక్రయిస్తున్న వారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం నగరంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో సీఐలు ఎస్‌కే బాజీజాన్ సైదా, ఒ.దుర్గాప్రసాద్‌లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం వెంకటేశ్వరపురం, జనార్దనరెడ్డి కాలనీ సమీపంలో జాతీయ రహదారి వద్ద అనుమానాస్పదంగా ఉన్న కొడవలూరు మండలానికి చెందిన గుర్రం వేణుగోపాల్, వెంకటేశ్వరపురం, జనార్దనరెడ్డి కాలనీకు చెందిన ఎస్‌కే ఖాజారహంతుల్లా అలియాజ్ ఖాజాబాబాను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు.
వీరు నిషేధిత గుట్కాలను అక్రమంగా నెల్లూరుకు తీసుకువచ్చి దుకాణాలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారన్నారు. వారి నుంచి 67.190 ప్యాకెట్ల గుట్కా, రాజాఖైనీ, హాన్స్, మీరాజ్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.7.50 లక్షలు ఉంటుందని చెప్పారు. వారిపై నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఖాజారహంతుల్లాను గతంలో రెండుసార్లు గుట్కాలను రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
గుట్కాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని క్రైమ్ డీఎస్పీ ఎం.బాలసుందరరావు అభినందించి రివార్డులు ప్రకటించారని తెలిపారు. సమావేశంలో నవాబుపేట సీఐ ఎన్.వెంకట్రావు, ఎస్సై వీవీ రమణయ్య, సీసీఎష్ ఎస్సై ఎస్‌కే షరీఫ్, హెడ్ కానిస్టేబుల్స్ జె.వెంకయ్య, ఆర్.సత్యనారాయణబాబు, కానిస్టేబుల్స్ విజయప్రసాద్, అరుణ్ కుమార్, నరేష్, సుబ్బారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment