khaini packet
-
భారీగా ఖైనీ స్వాధీనం
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం: జాతీయ రహదారిపై అక్రమంగా రవాణా చేస్తున్న ఖైనీ ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని తెలిపారు. స్థానిక సీఐ భవానిప్రసాద్ తెలిపిన వివరాలు ఇలావున్నాయి. జాతీయ రహదారిపై పట్టణంలోని బెల్లుపడ టోల్‌ప్లాజా సమీపంలో పట్టణ ఇన్చార్జి రూరల్ ఎస్ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో టోల్ ప్లాజాకు చేరిన ఐచర్ వ్యాన్‌ను పోలీసులు నిలిపి తనిఖీలు నిర్వహిస్తుండగా అందులో ఉన్న వాహన యజమాని సింహాచలం, డ్రైవర్ సుభలు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు గుర్తించి వారిని పట్టుకొని వారితో పాటు సరుకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా ఒడిశాలోని బరంపురం ఉత్కల్ బస్టాండ్ వద్ద హరిప్రియ ట్రేడర్స్ నుంచి 200 బాక్సుల మీరాజ్ ఖైనీని వ్యాన్‌లో లోడ్‌చేసుకొని గుణుపూర్‌లోని నందికేశ్వరరావు అనే వ్యక్తికి సరఫరా చేస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో ఇటువంటి పదార్థాలు నిషేధం కావడంతో ఈ పదార్థాలు కొన్న వ్యక్తిని ఏ1గా, విక్రయించిన వ్యక్తిని ఏ2గా పరిగణించి కేసు నమోదు చేశామని ఇన్చార్జి ఎస్ఐ కోటేశ్వరరావు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇందులో ఏఎస్ఐ నాగార్జున, చంద్రయ్య, పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
గుట్కా వ్యాపారుల అరెస్ట్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నిషేధిత గుట్కా, ఖైనీలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి రహస్యంగా నెల్లూరులోని పలు ప్రాంతాల్లో దుకాణదారులకు విక్రయిస్తున్న వారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం నగరంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో సీఐలు ఎస్కే బాజీజాన్ సైదా, ఒ.దుర్గాప్రసాద్‌లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం వెంకటేశ్వరపురం, జనార్దనరెడ్డి కాలనీ సమీపంలో జాతీయ రహదారి వద్ద అనుమానాస్పదంగా ఉన్న కొడవలూరు మండలానికి చెందిన గుర్రం వేణుగోపాల్, వెంకటేశ్వరపురం, జనార్దనరెడ్డి కాలనీకు చెందిన ఎస్కే ఖాజారహంతుల్లా అలియాజ్ ఖాజాబాబాను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. వీరు నిషేధిత గుట్కాలను అక్రమంగా నెల్లూరుకు తీసుకువచ్చి దుకాణాలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారన్నారు. వారి నుంచి 67.190 ప్యాకెట్ల గుట్కా, రాజాఖైనీ, హాన్స్, మీరాజ్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.7.50 లక్షలు ఉంటుందని చెప్పారు. వారిపై నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఖాజారహంతుల్లాను గతంలో రెండుసార్లు గుట్కాలను రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. గుట్కాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని క్రైమ్ డీఎస్పీ ఎం.బాలసుందరరావు అభినందించి రివార్డులు ప్రకటించారని తెలిపారు. సమావేశంలో నవాబుపేట సీఐ ఎన్.వెంకట్రావు, ఎస్సై వీవీ రమణయ్య, సీసీఎష్ ఎస్సై ఎస్కే షరీఫ్, హెడ్ కానిస్టేబుల్స్ జె.వెంకయ్య, ఆర్.సత్యనారాయణబాబు, కానిస్టేబుల్స్ విజయప్రసాద్, అరుణ్ కుమార్, నరేష్, సుబ్బారావు పాల్గొన్నారు. -
రూ.20 లక్షల ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భారీగా ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న వ్యాన్‌ను ఆపి పోలీసులు తనిఖీ చేయగా అందులో సుమారు 50 బాక్సులలో ఉన్న ఖైనీ ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. వ్యాన్‌ను, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.