
బలవన్మరణానికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్ మాధవరావు
ప్రకాశం,చీరాల రూరల్: అనారోగ్యానికి గురై మనస్థాపం చెందిన హెడ్ కానిస్టేబుల్ తన ఇంట్లోనే లుంగీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం వేటపాలెం మండలంలోని కొత్తపేటలో చోటుచేసుకుంది. టూ టౌన్ ఎస్సై కొక్కిలిగడ్డ విజయ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు వేటపాలెం పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే కొండె మాధవరావు (48) తన కుటుంబ సభ్యులతో కలసి కొత్తపేటలోని అద్దె గృహంలో నివాసముంటున్నారు. మాధవరావు కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నప్పటికీ వ్యాధుల తీవ్రత తగ్గకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. తన అనారోగ్యం గురించి తోటి సిబ్బంకి నిత్యం చెబుతూ బాధపడుతుండేవాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో తన లుంగీతో ప్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బజారుకు వెళ్లి తిరిగి వచ్చిన మృతుడి భార్య నాగారపమ్మ జరిగిన సంఘటనను చూసి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఉరికి వేలాడుతున్న మాధవరావును కిందికి దించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిక్షించిన వైద్యులు మాధవరావు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్సై విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి భార్య వద్ద వివరాలను సేకరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త మృతి చెందడంతో భార్య నాగారపమ్మ బీటెక్, ఇంటర్మీడియట్ చదివే అతని ఇద్దరు కుమారులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమకింక దిక్కెవ్వరంటూ వారు చేసిన రోధనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment