సాక్షి, హైదరాబాద్ : గొలుసు కట్టు వ్యాపారం పేరిట హీరా గ్రూపు సంస్థ అధినేత్రి నౌహీరా షేక్ ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీ సీబీసీఐడీ పోలీసులు ఆమెను విచారించగా.. తాజాగా కోర్టు అనుమతితో తెలంగాణ పోలీసులు నౌహీరాను 5 రోజుల కస్టడీకీ తీసుకున్నారు. సైబరాబాద్ పోలీసులు ఆమెను విచారించనున్నారు. చిత్తూరు జిల్లా మదన పల్లెకు చెందిన నౌహీరా.. హీరా గ్రూపుల్లో అక్రమ మార్గాల ద్వారా ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించి, వినియోగదారులను మోసం చేశారంటూ గతేడాది అక్టోబర్‌లో చిత్తూరు జిల్లా కలకడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. (హీరా పెదవి విప్పేనా..?)
నౌహీరా షేక్– మనీ సర్క్యులేషన్ సామ్రాజ్యంలో దేశ వ్యాప్తంగా మార్మోగిన పేరిది. రూ.6 వేల కోట్ల డిపాజిట్లు, దేశవ్యాప్తంగా 1.35 లక్షల మందికి పైగా వినియోగదారులున్న సంస్థను హీరా ఒంటి చేత్తో నడిపించారు. అయితే కాలక్రమంలో చెల్లింపుల విషయంలో జిల్లాలోని పలువురు డిపాజిటర్ల నమ్మకం కోల్పోయింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశ వ్యాప్తంగా ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సాగుతున్న హీరా గ్రూపు వ్యాపారాల్లో భారీగా విదేశీ సంస్థలున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment