సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ కేసు నిందితుడు, టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ అరెస్ట్ ఎప్పుడనేది మంగళవారం తేలే అవకాశం కనిపిస్తోంది. రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తన విచారణను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. పలు నేరారోపణ కేసులలో రవిప్రకాష్ తనకు బెయిల్ కావాలని కోరుతుంటే.. రవికి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని, కాబట్టి బెయిల్ ఇవ్వద్దని పోలీసుల తరపు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలూ విన్న న్యాయస్థానం సోమవారం తన విచారణను మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
టీవీ9 చానెల్‌లో పలు ఆర్ధిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ సీఈవో రవిప్రకాష్ సైబర్ క్రైమ్ విచారణకు హాజరైనా ఏ మాత్రం విచారణకు సహకరించడంలేదన్నది పోలీసులు అంటున్నారు. అదేవిధంగా టీవీ 9 లోగోని పాతసామాను అమ్మేసినట్లు 99 వేలకి చిల్లరగా అమ్మేసిన కేసులో బంజారాహిల్స్ పోలీసులు రవిని విచారించారు. అయితే ఈ విచారణలోనూ రవిప్రకాష్ పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా తప్పించుకున్నాడని తెలుస్తోంది. మొత్తానికి రవి ప్రకాష్ పై నమోదైన కేసులకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలనూ సేకరించిన పోలీసులు విచారణ అనంతరం నివేదికను రూపొందించి హైకోర్టుకు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment