సాక్షి, హైదరాబాద్: మందుబాబులకు హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తికి 10 రోజుల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. తాగి వాహనాలు నడపడం సమాజానికి హానికరంగా మారిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మహమ్మారి వల్ల అనేకమంది అమాయకులైన పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నారని, దీంతో కుటుంబాలు చెల్లాచెదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు మంగళవారం తీర్పునిచ్చారు.
సికింద్రాబాద్, పార్సీగుట్టకు చెందిన చంద్రశేఖర్ గతేడాది జూన్ 15న మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ నాలుగో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు చంద్రశేఖర్‌కు 10 రోజుల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించింది. అలాగే మోటార్ వాహనాల చట్ట నిబంధనల ఉల్లంఘన కింద రూ.100 జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేయగా, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి విచారణ జరిపారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సమర్థించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ చంద్రశేఖర్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు విచారణ జరిపారు. పిటిషనర్ మద్యం తాగి వాహనం నడపడం ఇది రెండోసారని, కాబట్టి అతనిపై ఉదాసీనత చూపాల్సిన అవసరం లేదని తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషన్‌ను కొట్టేశారు.
మొదటి శిక్షతో మార్పు రాలేదు..
పిటిషనర్‌కు తాగి వాహనం నడిపితే జరిగే పరిణామాలు తెలుసని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే అతడు రెండోసారి కూడా అదే తప్పు చేశారని చెప్పారు. ‘పిటిషనర్ గతంలో చేసిన తప్పు నుంచి పాఠం నేర్చుకోలేదు. ఈసారి కఠిన శిక్ష పడితే ఆ తప్పు మరోసారి పునరావృతం చేయడు’అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ చంద్రశేఖర్ పిటిషన్‌ను కొట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment