సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజధానికి భూమి ఇవ్వని రైతు పొలంలో రోడ్డు వేయడానికి అధికారులు ప్రయత్నించటంతో రైతు అడ్డుకోవటం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వేల ఎకరాల పంట భూముల్ని సేకరించిన విషయం విధితమే. కాగా రాజధాని మౌళిక వసతుల కోసం సీఆర్ డీఎ ఆధ్వర్యంలో ప్రస్తుతం రోడ్ల నిర్మాణం జరుగుతోంది. అయితే రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వని రైతు గద్దె మీరా ప్రసాద్‌కు చెందిన పొలంలో అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న మీరా ప్రసాద్ అధికారులను అడ్డగించాడు. దీంతో అధికారులు తుళ్లూరు పోలీసులకు సమాచారం అందించడంతో వారు మీరా ప్రసాద్‌ను అక్కడినుంచి తరలించే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులకు, రైతుకు మధ్య జరిగిన పెనుగులాటలో అతడి చొక్కా చిరిగిపోయినా అర్థనగ్నంగానే అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టాడు. ఈ నిరసనకు అతడి బంధువులు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సైతం మద్దతు తెలిపారు. అయితే ఎవ్వరు అడ్డుకున్నా రోడ్డు వేసి తీరతామంటూ అధికారులు తేల్చిచెబుతున్నారు. మీరా ప్రసాద్‌కు మద్దతుగా సంఘటనా స్థలం దగ్గరకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డీఎస్పీ కేశప్ప ఆదేశించారు. రైతులు గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని అక్కడికి వస్తే కేసు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment