కూకట్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. బస్సులు ధ్వంసం | High Tension In Kukatpally Over Bus Accident Issue | Sakshi
Sakshi News home page

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కూకట్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత

Published Mon, Oct 29 2018 11:35 AM | Last Updated on Mon, Oct 29 2018 4:24 PM

High Tension In Kukatpally Over Bus Accident Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి కాలేజీ విద్యార్థిని బలైందని తోటి విద్యార్థులు ఆగ్రహించటంతో కూకట్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం కూకట్‌పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రమ్య అనే ఇంటర్‌ విద్యార్థిని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ ఫస్టియర్‌ చదువుతోంది. ఈ ఉదయం కాలేజీకి వెళ్లడానికి కూకట్‌ పల్లి బీజేపీ ఆఫీస్‌ వద్ద రోడ్డు దాటుతుండగా శ్రీ చైతన్య కాలేజీకి చెందిన బస్సు ఆమెను ఢీకొంది.

దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. శ్రీ చైతన్య కాలేజీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ఫోన్‌ మాట్లాడుతూ బస్సు నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ తోటి విద్యార్థులు ఆగ్రహించారు. దాదాపు 10 బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కాలేజీ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళన కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపు చేయటానికి విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. కూకట్‌పల్లిలోని కాలేజీలను విద్యార్థులు బంద్‌ చేయిస్తూ నిరసన తెలియజేస్తున్నారు. 

ఈ సంఘటనపై మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. ‘‘ జీబ్రా క్రాసింగ్‌ వద్ద రోడ్డు దాటుతుండగా విద్యార్థినిని బస్సు ఢీకొంది. కోపంతో ఉన్న విద్యార్థులు బస్సులపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. యాజమాన్యంతో కూడా మాట్లాడతాం. ఈ ప్రాంతంలో 20 వేల మంది విద్యార్థులు ఉంటారు. తల్లిదండ్రులు, టీచర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది’’ అని అన్నారు. 
 
చైతన్య కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు పెట్టాలి
శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు పెట్టాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. కూకట్‌పల్లి ప్రమాద ఘటనపై విద్యార్థి సంఘాల నేతలు స్పందించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement