బంజారాహిల్స్: హిజ్రాల పాలిటకాలయముడిగా మారిన పాత నేరస్తుడు, రౌడీషీటర్ కుమ్మరి వెంకట్ యాదవ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు హత్య కేసులు, 9 దోపిడీ, దొమ్మీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకట్ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గుండు కొట్టించుకుని మారువేషంలో తిరుగుతూ రోజుకో సిమ్‌కార్డు మారుస్తూ, నాలుగు రాష్ట్రాల్లో తల దాచుకుంటున్నాడు. ఎట్టకేలకు బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ అతడిని అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కళింగరావు సూచనల మేరకు డీఐ రవికుమార్ నాలుగు రోజుల పాటు అనంతపురంలో మకాంవేసి ఓ లాడ్జిలో ఉంటున్న వెంకట్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా, కక్కాల్‌పల్లి గ్రామానికి చెందిన వెంకట్ యాదవ్ 2016 జనవరిలో బంజారాహిల్స్, ఇందిరానగర్‌లో బ్రహ్మం అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్యచేసి జైలుకు వెళ్లాడు.
2015లో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రవళిక అనే హిజ్రాను రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇందిరానగర్‌లో యాస్మిన్ అనే హిజ్రాపై దాడి చేసి నగలు, నగదు దోచుక్కెళ్లాడు. అప్పటినుండి తప్పించుకు తిరుగుతున్న వెంకట్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. అయితే, గత నెలలో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో స్వప్న అనే హిజ్రాపై దాడి చేసి నగదు దోచుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఖైత్లాపూర్‌లో హిజ్రాలను సమావేశపరిచి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఇప్పటిదాకా అతడిపై 11 కేసులు నమోదై ఉన్నాయి. 2008లో దివ్య అనే హిజ్రాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతను హిజ్రాలందరితో పరిచయం పెంచుకున్నాడు. 2015 నాటికి హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని దాదాపు 3000 మంది హిజ్రాల పాలిట యముడయ్యాడు.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో హిజ్రాలతో గ్రూప్ ఏర్పాటు చేయించి, ప్రతినెలా హప్తా వసూలు చేసేవాడు. ఇలా ప్రతి నెల రూ.1.50 లక్షల వరకు వసూలు చేసేవాడు. ఎవరైనా మామూళ్లు ఇవ్వకపోతే కొట్టడం, కిడ్నాప్, కత్తులతో గాట్లు పెట్టడం, బ్లేడ్‌తో చేతులపై కోయడం తదితర అకృత్యాలకు పాల్పడేవాడు. దీంతో గత నాలుగేళ్లుగా నగరంలోని హిజ్రాలు వెంకట్ పేరు చెబితేనే హడలిపోతున్నారు. తరచూ తనకు నచ్చిన హిజ్రాపై లైంగిక దాడికి పాల్పడటం, వారి వద్ద డబ్బు లాక్కుని పరారవ్వడం మామూలైపోయింది. జైలుశిక్ష అనుభవించినా అతడిలో మార్పు రాలేదు. అతని ఆగడాలను నియంత్రించాలని పలుమార్లు హిజ్రాలు ధర్నాలు సైతం చేశారు. పోలీసుల రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా నమోదైన అతను ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో హిజ్రాలు ఊపిరి పీల్చుకున్నారు.
మాట్లాడుతున్న సామాజిక కార్యకర్త దేవి ..
రౌడీషీటర్ నుంచికాపాడండి
పంజగుట్ట: నగరంలో ట్రాన్స్‌జెండర్లను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న రౌడీషీటర్ వెంకట్ యాదవ్ బారినుండి తమను కాపాడాలని, అతనికి బెయిల్ రాకుండా చూడాలని పలువురు ట్రాన్స్‌జెండర్లు కోరారు. ఎట్టకేలకు బంజారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్టు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వెంకటేష్ యాదవ్ బయటికి వస్తే అకృత్యాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సామాజిక కార్యకర్త దేవితో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా వెంకట్ యాదవ్ తమను అన్ని విధాలుగా వేధిస్తున్నాడన్నారు. 2015లో ప్రవల్లిక అనే ట్రాన్స్‌జెండర్‌ను హత్య చేయడమే కాకుండా పలువురు ట్రాన్స్‌జెండర్లపై అనుచరులతో దాడిచేసి బంగారం, నగదు లాక్కెళ్లే వాడన్నారు. అతను ఎప్పుడు దాడి చేస్తాడో అని బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతికామన్నారు.
రెండు రోజులక్రితం అతడిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసులు అతను బయటకు రాకుండా జైలులోనే ఉంచాలని, అప్పుడే తాము ధైర్యంగా ఉంటామన్నారు. నా అనే వారు లేక భిక్షాటనతో పొట్టపోసుకుంటున్న తమకు వెంకట్ యాదవ్ రూపంలో పెద్ద సమస్య వచ్చిపడిందన్నారు. అతనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీస్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు. సమాజం ట్రాన్స్‌జెండర్లను దూరం పెట్టడంతోనే సమస్యలు వస్తున్నాయని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని దేవి పేర్కొన్నారు. వారికి కూడా ఓటు హక్కు ఉందని, ఈ విషయాన్ని నాయకులు మర్చిపోతున్నారన్నారు. వెంకట్ యాదవ్ నేరాలన్నింటినీ పరిశీలించి అతనిపై చార్జీషీట్ వేయాలన్నారు. వెంకట్ యదవ్ జైలులో ఉన్నా అతని అనుచరుల ఆగడాలు తగ్గలేదని, వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని హక్కుల కార్యకర్త లారెన్స్ అన్నారు. సమావేశంలో చంద్రముఖి, బాబి, సోనా రాధోడ్, రమ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment