rowdy sheeter arrest
-
హిజ్రాల పాలిట కాల'యముడు'
బంజారాహిల్స్: హిజ్రాల పాలిటకాలయముడిగా మారిన పాత నేరస్తుడు, రౌడీషీటర్ కుమ్మరి వెంకట్ యాదవ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు హత్య కేసులు, 9 దోపిడీ, దొమ్మీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకట్ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గుండు కొట్టించుకుని మారువేషంలో తిరుగుతూ రోజుకో సిమ్‌కార్డు మారుస్తూ, నాలుగు రాష్ట్రాల్లో తల దాచుకుంటున్నాడు. ఎట్టకేలకు బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ అతడిని అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు సూచనల మేరకు డీఐ రవికుమార్ నాలుగు రోజుల పాటు అనంతపురంలో మకాంవేసి ఓ లాడ్జిలో ఉంటున్న వెంకట్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా, కక్కాల్‌పల్లి గ్రామానికి చెందిన వెంకట్ యాదవ్ 2016 జనవరిలో బంజారాహిల్స్, ఇందిరానగర్‌లో బ్రహ్మం అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను హత్యచేసి జైలుకు వెళ్లాడు. 2015లో కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రవళిక అనే హిజ్రాను రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇందిరానగర్‌లో యాస్మిన్ అనే హిజ్రాపై దాడి చేసి నగలు, నగదు దోచుక్కెళ్లాడు. అప్పటినుండి తప్పించుకు తిరుగుతున్న వెంకట్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. అయితే, గత నెలలో కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో స్వప్న అనే హిజ్రాపై దాడి చేసి నగదు దోచుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఖైత్లాపూర్‌లో హిజ్రాలను సమావేశపరిచి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఇప్పటిదాకా అతడిపై 11 కేసులు నమోదై ఉన్నాయి. 2008లో దివ్య అనే హిజ్రాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతను హిజ్రాలందరితో పరిచయం పెంచుకున్నాడు. 2015 నాటికి హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని దాదాపు 3000 మంది హిజ్రాల పాలిట యముడయ్యాడు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో హిజ్రాలతో గ్రూప్ ఏర్పాటు చేయించి, ప్రతినెలా హప్తా వసూలు చేసేవాడు. ఇలా ప్రతి నెల రూ.1.50 లక్షల వరకు వసూలు చేసేవాడు. ఎవరైనా మామూళ్లు ఇవ్వకపోతే కొట్టడం, కిడ్నాప్, కత్తులతో గాట్లు పెట్టడం, బ్లేడ్‌తో చేతులపై కోయడం తదితర అకృత్యాలకు పాల్పడేవాడు. దీంతో గత నాలుగేళ్లుగా నగరంలోని హిజ్రాలు వెంకట్ పేరు చెబితేనే హడలిపోతున్నారు. తరచూ తనకు నచ్చిన హిజ్రాపై లైంగిక దాడికి పాల్పడటం, వారి వద్ద డబ్బు లాక్కుని పరారవ్వడం మామూలైపోయింది. జైలుశిక్ష అనుభవించినా అతడిలో మార్పు రాలేదు. అతని ఆగడాలను నియంత్రించాలని పలుమార్లు హిజ్రాలు ధర్నాలు సైతం చేశారు. పోలీసుల రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా నమోదైన అతను ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో హిజ్రాలు ఊపిరి పీల్చుకున్నారు. మాట్లాడుతున్న సామాజిక కార్యకర్త దేవి .. రౌడీషీటర్ నుంచికాపాడండి పంజగుట్ట: నగరంలో ట్రాన్స్జెండర్లను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న రౌడీషీటర్ వెంకట్ యాదవ్ బారినుండి తమను కాపాడాలని, అతనికి బెయిల్ రాకుండా చూడాలని పలువురు ట్రాన్స్జెండర్లు కోరారు. ఎట్టకేలకు బంజారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్టు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వెంకటేష్ యాదవ్ బయటికి వస్తే అకృత్యాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సామాజిక కార్యకర్త దేవితో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా వెంకట్ యాదవ్ తమను అన్ని విధాలుగా వేధిస్తున్నాడన్నారు. 2015లో ప్రవల్లిక అనే ట్రాన్స్‌జెండర్‌ను హత్య చేయడమే కాకుండా పలువురు ట్రాన్స్జెండర్లపై అనుచరులతో దాడిచేసి బంగారం, నగదు లాక్కెళ్లే వాడన్నారు. అతను ఎప్పుడు దాడి చేస్తాడో అని బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతికామన్నారు. రెండు రోజులక్రితం అతడిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసులు అతను బయటకు రాకుండా జైలులోనే ఉంచాలని, అప్పుడే తాము ధైర్యంగా ఉంటామన్నారు. నా అనే వారు లేక భిక్షాటనతో పొట్టపోసుకుంటున్న తమకు వెంకట్ యాదవ్ రూపంలో పెద్ద సమస్య వచ్చిపడిందన్నారు. అతనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీస్స్టేషన్ల ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు. సమాజం ట్రాన్స్జెండర్లను దూరం పెట్టడంతోనే సమస్యలు వస్తున్నాయని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని దేవి పేర్కొన్నారు. వారికి కూడా ఓటు హక్కు ఉందని, ఈ విషయాన్ని నాయకులు మర్చిపోతున్నారన్నారు. వెంకట్ యాదవ్ నేరాలన్నింటినీ పరిశీలించి అతనిపై చార్జీషీట్ వేయాలన్నారు. వెంకట్ యదవ్ జైలులో ఉన్నా అతని అనుచరుల ఆగడాలు తగ్గలేదని, వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని హక్కుల కార్యకర్త లారెన్స్ అన్నారు. సమావేశంలో చంద్రముఖి, బాబి, సోనా రాధోడ్, రమ్య తదితరులు పాల్గొన్నారు. -
గన్ వెనుక గుట్టురట్టు
భయపడిందే నిజమైంది.. గన్ కొనుగోలు యత్నం వెనుక పెద్ద గూడుపుఠాణీయే ఉంది. రౌడీషీటర్ సుబ్బు కేసులో తీగ లాగితే డొంకంతా కదిలింది. రాజధానిలో రెండేళ్లుగా వ్యవస్థీకృతమైన రౌడీగ్యాంగ్‌ల బండారం బట్టబయలవుతోంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో తెలంగాణలోని రాచకొండ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. విజయవాడలో రౌడీయిజం తీవ్రతను గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు బుధవారం నగరంలో ఆకస్మిక తనిఖీలు చేసి నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను కనిపెట్టారు. సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ పోలీసులు అప్పగించిన రౌడీషీటర్ సుబ్బును రాచకొండ పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. అంతకుముందు అతడిని విచారించి పలు విషయాలను రాబట్టారని సమాచారం. పొట్లూరి ఈశ్వర్, తెల్లగోర్ల సునీల్‌కుమార్ తాము సుబ్బు కోసమే బీహార్ నుంచి అక్రమంగా తుపాకి తెప్పించామని చెప్పిన విషయం తెలిసిందే. కానీ, ఈశ్వర్, సునీల్‌లే తనకు తుపాకి అమ్మజూపారు తప్పా తాను కొనుగోలుకు యత్నించలేదని సుబ్బు మొదట్లో చెప్పినట్లు తెలుస్తోంది. కానీ, ఈశ్వర్, సునీల్ వెల్లడించిన విషయాలను వరుస క్రమంలో పోలీసులు చెప్పేసరికి అతను తడబడ్డాడని సమాచారం. సుబ్బు సంప్రదించకుండా అతనికి తుపాకి అవసరం అని వారిద్దరికీ ఎలా తెలుస్తుంది? అసలు వారితో సుబ్బుకు పరిచయం ఎలా ఏర్పడింది? అంతగా ఆయుధం అవసరం ఏమొచ్చింది? దీనివెనుక లక్ష్యం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు తమదైనశైలిలో విచారించినట్లు సమచారం. దాంతో అసలు విషయం బయటపడినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాజధానిలో రౌడీ నెట్వర్క్ రాచకొండ పోలీసుల సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సుబ్బు ఒక్కడే కాదు.. మరెన్నో గ్యాంగ్‌లు ఉన్నాయి. రాజధానిలో కొన్నేళ్లుగా రౌడీయిజం వ్యవస్థీకృతం అవుతోందని రాచకొండ పోలీసుల విచారణలో వెల్లడైంది. టీడీపీ ప్రజాప్రతినిధి అండతో సుబ్బు ప్రస్తుతం న్యూరాజరాజేశ్వరిపేట కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్నాడు. పాయకాపురం, కొత్తఆర్ఆర్పేట, అజిత్‌సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆధిపత్యం చలాయిస్తున్నాడు. రానున్న రోజుల్లో నగరం అంతటా కూడా తమ ప్రాబల్యం విస్తరించేలా వ్యూహం పన్నారని పోలీసులు తెలుసుకున్నారు. కానీ, నగరంలో మరికొన్ని గ్యాంగ్‌లు ఉండటం కొంత అడ్డంకిగా మారింది. ఇక తెనాలిలో పాతకక్షలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంపై ఆధిపత్యం కోసం తనకు ఆయుధం ఉండాలని భావించారు. బీహార్ నుంచి అక్రమంగా ఆయుధం తెప్పించేందుకు ఈశ్వర్, సునీల్‌ను సంప్రదించాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాలను రాచకొండ పోలీసులు విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన విజయవాడ పోలీసులు సుబ్బు విచారణలో ఆందోళనకర అంశాలు వెల్లడి కావడంతో విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధానిలో రౌడీయిజంపై ‘సాక్షి’ వరుస కథనాలపై ఇప్పటికే సీపీ గౌతం సవాంగ్ స్పందించి రౌడీలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. రాచకొండ పోలీసులు అందించిన సమాచారంతో ఆ విషయాన్ని మరింత నిర్ధారించింది. దాంతో విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. నగరంలో బుధవారం తెల్లవారుజామున కార్డెన్, సెర్చ్ నిర్వహించారు. వాంబేకాలనీలో విస్తృతంగా తనిఖీలు చేశారు. 9 మంది పాత నేరస్తులు, 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ 23 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. మొత్తం 274 వాహనాలను తనిఖీ చేయగా, ఎలాంటి రికార్డులు లేని 10 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డెన్, సెర్చ్‌ను నగరం అంతటా విస్తృతంగా నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. -
ఏం చెబుతాడో ఏమో!
సాక్షి, అమరావతిబ్యూరో : తెలంగాణ పోలీసుల విచారణలో రౌడీషీటర్ సుబ్బు ఏమి చెబుతాడో ఏమో..? ఎలాగైనా అతడిని రక్షించాలి... ఇదొక్కటే ప్రస్తుతం విజయవాడకు చెందిన టీడీపీ పెద్దల ముందున్న ఏకైక లక్ష్యం. అక్రమంగా ఆయుధాల కొనుగోలుకు యత్నించిన కేసులో అతడిని రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి తెలంగాణ పోలీ సులకు అప్పగించారు. అక్కడి పోలీసుల విచారణలో సుబ్బ ఏ విషయాలు బయటపెడతాడో...? అవి తమకు ఎక్కడ చుట్టుకుంటాయో అనే గుబులు విజయవాడ టీడీపీ పెద్దలకు నిద్రపట్టకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. మరోవైపు రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మీడియాకు వెల్లడించారు. టీడీపీ పెద్దల అండతోనే...!? గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కాళిదాసు సుబ్రహ్మణ్యం అలియాస్ వేమూరి సుబ్బు ఓ రౌడీ షీటర్. అతడిని విజయవాడ టీడీపీ పెద్దలు మరింతగా పెంచిపోషించారు. తమ రాజకీయ అవసరాల కోసం అతడికి అండదండలు అందించారు. సుబ్బు విజయవాడకు చేరిన కొత్తలో కొన్నాళ్లు కాట్రగడ్డ శ్రీనుకు అనుచరుడిగా ఉన్నాడు. ఆ సమయంలోనే వంగవీటి శంతన్‌కుమార్‌పై జరి గిన కాల్పుల కేసులో అతడిని పోలీసులు నిందితుడిగా గుర్తించారు. అనంతరం సుబ్బు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వర్గంలో చేరాడు. కొద్ది కాలంలోనే ఎమ్మెల్యే బొండాకు అత్యంత సన్నిహితుడిగా మారడం టీడీపీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. ఏకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో సుబ్బు సాన్నిహిత్యం పెంచుకున్నాడని ఫొటో ఆధారాలు చెబుతున్నాయి. సుబ్బు రాజ రాజేశ్వరిపేట కేంద్రంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఓ టీడీపీ ప్రజాప్రతినిధి అండదండలతోనే సుబ్బు అంతగా చెలరేగిపోతున్నాడని కూడా పోలీసులు గుర్తించారు. విజయవాడలో సద్దుమణిగిందనుకున్న రౌడీ వ్యవస్థను టీడీపీ పెద్దలు మళ్లీ పెంచిపోషించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్లలో మళ్లీ రౌడీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ పెద్దల్లో కలవరం హైదరాబాద్ పోలీసులు ఛేదించిన అక్రమ ఆయుధాల కొనుగోలు కేసులో సుబ్బు పాత్ర బయటపడంతో టీడీపీ పెద్దలు ఉలిక్కిపడ్డారు. తెనాలిలో ప్రతీకార దాడుల కోసమే సుబ్బు అక్రమంగా ఆయుధాల కొనుగోలుకు యత్నించాడని పోలీసులు ప్రాథమికంగా భావించారు. అయితే ఈ కేసులో అంతకుమించిన కోణం ఉందని తెలుస్తోంది. అదేమిటన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉన్నప్పటికీ పోలీసువర్గాల్లో కలకలం రేపుతోంది. మరో వైపు సుబ్బును విజయవాడ పోలీసులు అరెస్టు చేసి తెలంగాణ పోలీసులకు అప్పగించారు. తెలంగాణ పోలీసుల విచారణలో అతను ఏం చేబుతాడోనని టీడీపీ పెద్దలు కలవరపడుతున్నారు. అక్రమ ఆయుధాల కొనుగోలు యత్నం వెనుక టీడీపీ పెద్దల ప్రయోజనాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారిస్తే తీవ్ర సంచలనంగా మారుతుంది. దీంతో అతడిని రక్షించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందుకు విజయవాడకు చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. తెలంగాణకు చెందిన కొందరు ఉన్నతాధికారులు, పెద్దలతో తమకున్న పరిచయాలను తిరగదోడుతూ మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. వీలైనంత త్వరగా సుబ్బుకు బెయిల్ వచ్చేలా చేసేందుకు ఇప్పటికే కొందరిని హైదరాబాద్‌కు పంపించి నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసుల విచారణతో అక్రమ ఆయుధాల కేసు, దానితో విజయవాడకు ఉన్న సంబంధాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. శాంతిభద్రతలను పరిరక్షిస్తాం : సీపీ సవాంగ్ రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ స్పష్టంచేశారు. విజ యవాడలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధానిలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. సుబ్బుపై గతంలో తెనాలిలో రౌడీషీట్ ఉందని తెలిపారు. గతంలో విజయవాడలో శంతన్‌కుమార్‌పై జరిగిన కాల్పుల కేసులో అతను నింది తుడని కూడా చెప్పారు. అయితే ఆ కేసును 2012లో కొట్టివేశారన్నారు. 2014లో తెనాలిలో మేడిశెట్టి కృష్ణ హత్య కేసులో ఇతను నిందితుడని చెప్పారు. శాంతిభద్రతల దృష్ట్యా తెనాలిలో ఉండొద్దని అక్కడ పోలీసులు చెప్పడంతో సుబ్బు విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటకు వచ్చి వెళ్తున్నాడని వివరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈశ్వర్‌రెడ్డితో సుబ్బుకు పరిచయం ఉందన్నారు. ఈశ్వర్‌రెడ్డి చత్తీస్‌ఘడ్‌లో ఉండగా బిహార్‌కు చెందిన పప్పూతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. సుబ్బుకు విక్రయించేందుకే పప్పూ వద్ద రెండు తుపాకులు కొన్నానని ఈశ్వర్‌రెడ్డి తెలంగాణ పోలీసుల విచారణలో వెల్లడించాడని సీపీ సవాంగ్ చెప్పారు. తనవద్ద ఆ తుపాకులు ఉన్నాయనే ఈశ్వర్‌రెడ్డి చెప్పాడని, తాను మాత్రం కొనుగోలు చేస్తాననలేదని సుబ్బు తమ విచారణలో చెప్పాడని సీపీ వివరించారు. ఈ కేసులో వాస్తవాలేమిటో తెలుసుకునేందుకే సుబ్బును తెలంగాణ పోలీసులకు అప్పగించామని చెప్పారు. ఈనెల 28వ తేదీన విజయవాడలో ప్రొఫెసర్ ఐలయ్య నిర్వహించే సభ కోసం ఇంత వరకు తమకు ఎలాంటి దరఖాస్తు రాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీపీ సవాంగ్ సమాధానం చెప్పారు. అనుమతి కోరితే నిబంధనలను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
మీసం మెలేస్తే తాట తీస్తా
అనంతపురం : రౌడీషీటర్లు రోడ్లెక్కి మీసం మెలేస్తే తాట తీసేందుకు పోలీసులు కూడా ఉన్నారని వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. గురువారం వన్‌టౌన్ పరిధిలోని 15 మంది రౌడీషీటర్లను ఆయన స్టేషన్‌కు పిలిపించారు. తరచూ ఫిర్యాదులు అందుతున్నాయని, జాగ్రత్తగా మసలుకోవాలని వారికి సూచించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రౌడీషీటర్ల ఆగడాలకు కళ్లెం వేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా మసలుకోవాలని, తోక జాడిస్తే చూస్తూ ఊరుకోనన్నారు. రౌడీషీటర్లు వడ్డీ వ్యాపారులుగా అవతారమెత్తడం, వ్యాపారులకు అండగా ఉంటూ సామాన్యులపై భౌతికదాడులకు దిగడం, కాలనీల్లోకి ప్రజలను భయాందోళనకు గురి చేయడాన్ని తక్షణం మానుకోవాలన్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీ ముసుగులో చేరి వికృత చర్యలకు పాల్పడితే పోలీసులు చేతులు కట్టుకుని కూర్చోరన్నారు. చట్ట పరిధిలో ప్రతి రౌడీషీటర్‌పై చర్యలు ఉంటాయన్నారు. కష్టపడి సంపాదిస్తేనే ఎవరి జీవితానికైనా సార్థకత ఉం టుందని హితవు పలికారు. అలా కాకుండా నాలుగు సెటిల్మెంట్లు చేసి స్థిరపడాలని చూస్తే అంతకంత అనుభవించక తప్పదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్టేషన్ పరిధిలోని ప్రతి రౌడీషీటర్‌కు పోలీసుల నుంచి పి లుపు రాగానే హాజరుకావాలన్నారు. తప్పించుకుని తిరిగి తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రౌడీషీటర్ ఆనంద్ అరెస్ట్ రాజమ్మనగర్కు చెందిన దంపతులపై ఆధిపత్యం కొనసాగిస్తూ.. అధిక వడ్డీ వసూళ్లకు పాల్పడుతూ వేధించిన కేసులో రౌడీషీటర్ ఆనంద్‌ను అరెస్ట్ చేశామని, రిమాండ్‌కు తరలించనున్నామని సీఐ గోరంట్ల మాధవ్ తెలి పారు. పలు కాలనీల్లో అధిక వడ్డీలకు డబ్బులిచ్చి సామాన్యుల నెత్తురు, మాంసాలను పీక్కుతింటున్న ఆనంద్‌పై గతంలో పలు మార్లు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అయితే అతడు పోలీసుల కళ్లు గప్పి తిరుగుతుండడంతో గాలిస్తూ వచ్చామన్నారు. యాధృచ్చికంగా దంపతులపై దాడి చేసేందుకు కుట్ర పన్నడం, అదే సమయంలో బాధితురాలు షహనాజ్ పోలీసులను ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో పట్టుకున్నట్లు తెలిపారు.