భయపడిందే నిజమైంది.. గన్ కొనుగోలు యత్నం వెనుక పెద్ద గూడుపుఠాణీయే ఉంది. రౌడీషీటర్ సుబ్బు కేసులో తీగ లాగితే డొంకంతా కదిలింది. రాజధానిలో రెండేళ్లుగా వ్యవస్థీకృతమైన రౌడీగ్యాంగ్‌ల బండారం బట్టబయలవుతోంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో తెలంగాణలోని రాచకొండ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. విజయవాడలో రౌడీయిజం తీవ్రతను గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు బుధవారం నగరంలో ఆకస్మిక తనిఖీలు చేసి నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను కనిపెట్టారు.
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ పోలీసులు అప్పగించిన రౌడీషీటర్ సుబ్బును రాచకొండ పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. అంతకుముందు అతడిని విచారించి పలు విషయాలను రాబట్టారని సమాచారం. పొట్లూరి ఈశ్వర్, తెల్లగోర్ల సునీల్‌కుమార్ తాము సుబ్బు కోసమే బీహార్ నుంచి అక్రమంగా తుపాకి తెప్పించామని చెప్పిన విషయం తెలిసిందే. కానీ, ఈశ్వర్, సునీల్‌లే తనకు తుపాకి అమ్మజూపారు తప్పా తాను కొనుగోలుకు యత్నించలేదని సుబ్బు మొదట్లో చెప్పినట్లు తెలుస్తోంది. కానీ, ఈశ్వర్, సునీల్ వెల్లడించిన విషయాలను వరుస క్రమంలో పోలీసులు చెప్పేసరికి అతను తడబడ్డాడని సమాచారం. సుబ్బు సంప్రదించకుండా అతనికి తుపాకి అవసరం అని వారిద్దరికీ ఎలా తెలుస్తుంది? అసలు వారితో సుబ్బుకు పరిచయం ఎలా ఏర్పడింది? అంతగా ఆయుధం అవసరం ఏమొచ్చింది? దీనివెనుక లక్ష్యం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు తమదైనశైలిలో విచారించినట్లు సమచారం. దాంతో అసలు విషయం బయటపడినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
రాజధానిలో రౌడీ నెట్‌వర్క్
రాచకొండ పోలీసుల సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సుబ్బు ఒక్కడే కాదు.. మరెన్నో గ్యాంగ్‌లు ఉన్నాయి. రాజధానిలో కొన్నేళ్లుగా రౌడీయిజం వ్యవస్థీకృతం అవుతోందని రాచకొండ పోలీసుల విచారణలో వెల్లడైంది. టీడీపీ ప్రజాప్రతినిధి అండతో సుబ్బు ప్రస్తుతం న్యూరాజరాజేశ్వరిపేట కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్నాడు. పాయకాపురం, కొత్తఆర్‌ఆర్‌పేట, అజిత్‌సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆధిపత్యం చలాయిస్తున్నాడు. రానున్న రోజుల్లో నగరం అంతటా కూడా తమ ప్రాబల్యం విస్తరించేలా వ్యూహం పన్నారని పోలీసులు తెలుసుకున్నారు. కానీ, నగరంలో మరికొన్ని గ్యాంగ్‌లు ఉండటం కొంత అడ్డంకిగా మారింది. ఇక తెనాలిలో పాతకక్షలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంపై ఆధిపత్యం కోసం తనకు ఆయుధం ఉండాలని భావించారు. బీహార్ నుంచి అక్రమంగా ఆయుధం తెప్పించేందుకు ఈశ్వర్, సునీల్‌ను సంప్రదించాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాలను రాచకొండ పోలీసులు విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అప్రమత్తమైన విజయవాడ పోలీసులు
సుబ్బు విచారణలో ఆందోళనకర అంశాలు వెల్లడి కావడంతో విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధానిలో రౌడీయిజంపై ‘సాక్షి’ వరుస కథనాలపై ఇప్పటికే సీపీ గౌతం సవాంగ్ స్పందించి రౌడీలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. రాచకొండ పోలీసులు అందించిన సమాచారంతో ఆ విషయాన్ని మరింత నిర్ధారించింది. దాంతో విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. నగరంలో బుధవారం తెల్లవారుజామున కార్డెన్, సెర్చ్ నిర్వహించారు. వాంబేకాలనీలో విస్తృతంగా తనిఖీలు చేశారు. 9 మంది పాత నేరస్తులు, 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ 23 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. మొత్తం 274 వాహనాలను తనిఖీ చేయగా, ఎలాంటి రికార్డులు లేని 10 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డెన్, సెర్చ్‌ను నగరం అంతటా విస్తృతంగా నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment