హత్యాస్థలిలో మృతదేహం కోసం వెతుకుతున్న బంధువులు హత్యకు గురైన రాజ్‌కుమార్ (ఫైల్)
శింగనమల చెరువు వద్ద కంపచెట్లు తొలగిస్తున్న ఇద్దరు హిటాచీ డ్రైవర్ల మధ్య ఘర్షణ తలెత్తి.. ఒకరి హత్యకు దారి తీసింది. మృతదేహాన్ని అక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టేశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూడడంతో హతుడి బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను రప్పించి శాంతింపజేశారు.
అనంతపురం, శింగనమల : హిటాచీ డ్రైవర్ దారుణ హత్య శింగనమలలో కలకలం రేపింది. పోలీసులు, హతుడి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శింగనమల చెరువు కింద నాబార్డు నిధులతో నిర్వహించతలపెట్టిన పనులను నార్పల మండలం బొందలవాడకు చెందిన ఆలం వెంకటరమణ టెండర్ ద్వారా దక్కించుకున్నాడు. ఈ మేరకు తన దగ్గరున్న హిటాచీ ద్వారా చెరువు వద్ద కంపచెట్ల తొలగింపు చేపట్టాడు. ఈ హిటాచీకి బొందలవాడకు చెందిన రాజ్‌కుమార్(21), రాప్తాడు మండలం మరూరు బండమీదపల్లికి చెందిన సందీప్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. డిసెంబర్ 26వ తేదీన డ్రైవర్లు ఇద్దరూ తాగి పని వద్దే గొడవపడ్డారు. హిటాచీ నడుపుతున్న సందీప్ ఆగ్రహంతో కిందనున్న రాజ్‌కుమార్‌ను తొండం(ఇనుప బకెట్)తో కొట్టాడు. అంతే అతను కుప్పకూలిపోయాడు. కిందకు దిగివచ్చి చూడగా రాజ్‌కుమార్ చనిపోయినట్లు గుర్తించి, అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టాడు. అనంతరం హిటాచీని మరో ప్రదేశానికి తీసుకెళ్లి.. దాన్ని అక్కడే నిలిపి సందీప్ వచ్చేశాడు. మరువకొమ్మ వద్దకు రాజ్‌కుమార్ బంధువులను పిలిపించి.. మీవాడు (రాజ్‌కుమార్) ఇద్దరి మనుషులను వేసుకొచ్చి నన్ను కొట్టి పారిపోయాడని, సెల్ ఇక్కడే పడిపోయిందని చెప్పి సెల్ అప్పగించి వెళ్లిపోయాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి..
రాజ్‌కుమార్ కనిపించడం లేదని గొడవ జరిగిన రెండు రోజులకు కుటుంబ సభ్యులు శింగనమల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. మరో డ్రైవరు సందీప్ కరీంనగర్ వద్ద ఉన్నట్లు తెలుసుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో సందీప్ జరిగిందంతా చెప్పినట్లు తెలిసింది. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశం వద్దకు నిందితుడిని తీసుకుపోవాలని బుధవారం పోలీసులు సిద్ధమవగా.. అప్పటికే రాజ్‌కుమార్ బంధువులు ఆందోళనకు దిగారు. గంటపాటు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో అదనపు బలగాలను రప్పించారు. ఇటుకలపల్లి సీఐ పుల్లయ్య, బుక్కరాయసముద్రం సీఐ శ్రీహరి, ఎస్‌ఐలు కరీం, శ్రీనివాసులు, వారి సిబ్బంది వచ్చి భాదితులకు నచ్చజెప్పి పంపించివేశారు. నిందితుడిని మరో రోడ్డు ద్వారా ఇటుకలపల్లి సర్కిల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
హత్య జరిగిన ప్రదేశంలో గాలింపు
హత్య జరిగిన ప్రదేశాన్ని పోలీసులు బుధవారం ఉదయం నిందితుడి ద్వారా గుర్తించినట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆ ప్రదేశంలో గాలింపు చేపట్టారు. ఎక్కడా బయట పడకపోవడంతో ఆ ప్రదేశంలోనే చెట్ల కింద కూర్చుండిపోయారు. కుటుంబ సభ్యులు ఎక్కువ మంది అక్కడే ఉండడంతో మృతదేహం వెలికితీయలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment