driver murder mystery
-
హిటాచీ డ్రైవర్ దారుణహత్య
శింగనమల చెరువు వద్ద కంపచెట్లు తొలగిస్తున్న ఇద్దరు హిటాచీ డ్రైవర్ల మధ్య ఘర్షణ తలెత్తి.. ఒకరి హత్యకు దారి తీసింది. మృతదేహాన్ని అక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టేశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూడడంతో హతుడి బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను రప్పించి శాంతింపజేశారు. అనంతపురం, శింగనమల : హిటాచీ డ్రైవర్ దారుణ హత్య శింగనమలలో కలకలం రేపింది. పోలీసులు, హతుడి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శింగనమల చెరువు కింద నాబార్డు నిధులతో నిర్వహించతలపెట్టిన పనులను నార్పల మండలం బొందలవాడకు చెందిన ఆలం వెంకటరమణ టెండర్ ద్వారా దక్కించుకున్నాడు. ఈ మేరకు తన దగ్గరున్న హిటాచీ ద్వారా చెరువు వద్ద కంపచెట్ల తొలగింపు చేపట్టాడు. ఈ హిటాచీకి బొందలవాడకు చెందిన రాజ్‌కుమార్(21), రాప్తాడు మండలం మరూరు బండమీదపల్లికి చెందిన సందీప్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. డిసెంబర్ 26వ తేదీన డ్రైవర్లు ఇద్దరూ తాగి పని వద్దే గొడవపడ్డారు. హిటాచీ నడుపుతున్న సందీప్ ఆగ్రహంతో కిందనున్న రాజ్‌కుమార్‌ను తొండం(ఇనుప బకెట్)తో కొట్టాడు. అంతే అతను కుప్పకూలిపోయాడు. కిందకు దిగివచ్చి చూడగా రాజ్‌కుమార్ చనిపోయినట్లు గుర్తించి, అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టాడు. అనంతరం హిటాచీని మరో ప్రదేశానికి తీసుకెళ్లి.. దాన్ని అక్కడే నిలిపి సందీప్ వచ్చేశాడు. మరువకొమ్మ వద్దకు రాజ్‌కుమార్ బంధువులను పిలిపించి.. మీవాడు (రాజ్‌కుమార్) ఇద్దరి మనుషులను వేసుకొచ్చి నన్ను కొట్టి పారిపోయాడని, సెల్ ఇక్కడే పడిపోయిందని చెప్పి సెల్ అప్పగించి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి.. రాజ్‌కుమార్ కనిపించడం లేదని గొడవ జరిగిన రెండు రోజులకు కుటుంబ సభ్యులు శింగనమల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. మరో డ్రైవరు సందీప్ కరీంనగర్ వద్ద ఉన్నట్లు తెలుసుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో సందీప్ జరిగిందంతా చెప్పినట్లు తెలిసింది. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశం వద్దకు నిందితుడిని తీసుకుపోవాలని బుధవారం పోలీసులు సిద్ధమవగా.. అప్పటికే రాజ్‌కుమార్ బంధువులు ఆందోళనకు దిగారు. గంటపాటు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో అదనపు బలగాలను రప్పించారు. ఇటుకలపల్లి సీఐ పుల్లయ్య, బుక్కరాయసముద్రం సీఐ శ్రీహరి, ఎస్ఐలు కరీం, శ్రీనివాసులు, వారి సిబ్బంది వచ్చి భాదితులకు నచ్చజెప్పి పంపించివేశారు. నిందితుడిని మరో రోడ్డు ద్వారా ఇటుకలపల్లి సర్కిల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హత్య జరిగిన ప్రదేశంలో గాలింపు హత్య జరిగిన ప్రదేశాన్ని పోలీసులు బుధవారం ఉదయం నిందితుడి ద్వారా గుర్తించినట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆ ప్రదేశంలో గాలింపు చేపట్టారు. ఎక్కడా బయట పడకపోవడంతో ఆ ప్రదేశంలోనే చెట్ల కింద కూర్చుండిపోయారు. కుటుంబ సభ్యులు ఎక్కువ మంది అక్కడే ఉండడంతో మృతదేహం వెలికితీయలేకపోయారు. -
కారుడ్రైవర్ అనుమానాస్పద మృతి
నెల్లూరు(క్రైమ్): కారుడ్రైవర్ నెల్లూరులోని నగరంలోని ఓ లాడ్జీలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగనాయకులపేట రైలువీధికి చెందిన బాషా, రజియాలు దంపతులు. వారికి అబీద్, నౌషాద్ (33) పిల్లలు. అబీద్ బంగారు పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండగా నౌషాద్ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అబీద్‌కు ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. పెళ్లికి ముందు వరకు అన్నదమ్ములిద్దరూ చాలా ఆప్యాయంగా, స్నేహంగా ఉండేవారు. వివాహం తర్వాత అబీద్ వేరే కాపురం పెట్టాడు. అప్పటినుంచి నౌషాద్ మానసికంగా కృంగిపోయాడు. పలుమార్లు తనకు వివాహం చేయమని తల్లిదండ్రులను కోరాడు. అయితే పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి సక్రమంగా వచ్చేవాడు కాదు. పనిచేసుకుని నగరంలోని లాడ్జిలో ఉండేవాడు. రెండు, మూడునెలలకోసారి ఇంటికి వెళ్లేవాడు. నెలరోజులుగా అతను నగరంలోని ఆర్ఆర్ లాడ్జీలో రూం నంబర్ 302లో ఉంటున్నాడు. మూడో అంతస్తుపై నుంచి పడి.. నౌషాద్ సోమవారం రాత్రి ఫూటుగా మద్యం సేవించాడు. 11.30 గంటల సమయంలో రూమ్‌బాయ్‌ని పిలిచి పెరుగన్నం తెప్పించుకుని తిన్నాడు. అనంతరం ఏమైందో కానీ మంగళవారం తెల్లవారుజామున లాడ్జీ మూడో అంతస్తు పైనుంచి బ్రాందీషాప్నకు చెందిన స్థలంలో పడ్డాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. లాడ్జి సిబ్బంది గుర్తించి వెంటనే సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. సంతపేట ఎస్సై షేక్ సుభాన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. లాడ్జీ సిబ్బందితో మాట్లాడారు. మూడో అంతస్తు పైభాగంలో మృతుడి సెల్‌ఫోన్, కాలి చెప్పు ఒకటిపడి ఉంది. మృతదేహానికి సమీపంలో మరో చెప్పు పడి ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద కుప్పకూలిపోయి గుండెలవిసేలా విలపించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. నౌషాద్ ప్రమాదవశాత్తు పడిపోలేదని ఎవరో తోసివేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మద్యం మత్తులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడా? లేదా ఎవరైనా కిందకు తోసివేశారా? ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణాల్లో విచారణను వేగవంతం చేశారు. -
వీడిన డ్రైవర్ హత్యకేసు మిస్టరీ
రాజమండ్రి క్రైం : రాజమండ్రి గాదాలమ్మ నగర్లో గత నెల 28న జరిగిన విశాఖకు చెందిన కారు డ్రైవర్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. కొత్త కార్లు దొంగిలించి, వాటిని అమ్మి సొమ్ము చేసుకునే లక్ష్యంతో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బొమ్మూరు సీఐ పి. కనకారావు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం అనపర్తి గ్రామానికి చెందిన బుదిరెడ్డి దుర్గాసురేష్, వైరాల చిరంజీవి కొత్త కార్లను కిరాయికి మాట్లాడుకుని డ్రైవర్‌ను హత్య చేసి కార్లను దొంగిలిస్తుంటారు. జూన్ 28న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విశాఖపట్నంలోని సీఎంఆర్ షాపింగ్‌మాల్ సెంటర్ నుంచి మారుతీ కారును రాజమండ్రికి కిరాయికి మాట్లాడుకున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో కారులో రాజమండ్రి శాటిలైట్ సిటీ, రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ దాటిన తరువాత విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన కారు డ్రైవర్ కర్రి కిరణ్(26)ను కారులోనే కత్తులతో పొడిచి చంపారు. అనంతరం మృతదేహాన్ని శాటిలైట్ సిటీ శివారు ప్రాంతంలో పడేసి, కారులో మోరంపూడి సెంటర్లో ఒక పెట్రోల్ బంక్‌కు వచ్చి అక్కడ సీసాలో పెట్రోల్ తీసుకుని తిరిగి శవం వద్దకు వెళ్లారు. అదే కారులో డ్రైవర్ శవాన్ని బుచ్చియ్యనగర్ రోడ్డులోని గాదాలమ్మ నగర్ గుట్టపై తుప్పల్లో పడేసి, పెట్రోల్ పోసి కాల్చేశారు. కారును అక్కడ నుంచి రంగం పేట మండలం సింగపల్లి గ్రామంలో ఉన్న స్నేహితుడు కొప్పిరెడ్డి అంజి వద్దకు తీసుకెళ్లి విక్రయించమని అప్పగించారు. అంజి కారును ఇంటి వద్ద దాచాడు. ఆ మరుసటి రోజు హత్య గురించి పత్రికల్లో వచ్చిన వార్తను చదివి సురేష్, చిరంజీవి ఇచ్చిన సలహా మేరకు కారులోని ఆడియో సిస్టమ్‌ను, స్టెఫిన్ టైర్, పెన్‌డ్రైవ్‌లను సింగంపల్లి గ్రామానికి చెందిన యర్రంశెట్టి లక్ష్మీనారాయణ(పండు) సహాయంతో తీసివేసి, సూరంపాలెం పుష్కర ఎత్తిపోతల పథకం కాలువ వద్ద కారు వదిలివేశారు. కారులో కారం చల్లి ఆధారం దొరకకుండా జాగ్రత్తపడ్డారు. నిందితుడు బుదిరెడ్డి దుర్గా సురేష్ తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు డబ్బుల కోసం ఈ హత్య చేసిన ట్టు తెలుస్తోంది. పట్టించిన సీసీ కెమెరా పుటేజ్‌లు కేసు దర్యాప్తు కోసం కారు కిరాయికి మాట్లాడుకున్న ప్రదేశం విశాఖపట్నం సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు పోలీసులు వెళ్లారు. అదే ప్రాంతంలో ఉన్న స్పెన్సర్ షోరూమ్‌లో నిందితులు కత్తులు, కారం కొనుగోలు చేసినట్టు సీసీ కెమెరా ఫుటేజ్‌ల్లో నమోదైంది. దీంతో నిందితుల ఆచూకీ లభించింది. ధర్మవరం సమీపంలోని టోల్గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో కూడా నిందుతుల ఆధారాలు లభించాయి. ఆ ఫొటోల ఆధారంగా మోరంపూడి సెంటర్లోని ఒక పెట్రోల్ బంక్ వద్ద 28 రాత్రి పనిచేసిన సిబ్బందిని ఆరా తీయగా వారు నిందితులను గుర్తించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో బొమ్మూరు సీఐ పి.కనకారావుతో పాటు ఎస్సైలు కిషోర్ కుమార్, నాగేశ్వరరావు, ఏఎస్సై శివాజీ సహకరించారు.