రాజమండ్రి క్రైం : రాజమండ్రి గాదాలమ్మ నగర్‌లో గత నెల 28న జరిగిన విశాఖకు చెందిన కారు డ్రైవర్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. కొత్త కార్లు దొంగిలించి, వాటిని అమ్మి సొమ్ము చేసుకునే లక్ష్యంతో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బొమ్మూరు సీఐ పి. కనకారావు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం అనపర్తి గ్రామానికి చెందిన బుదిరెడ్డి దుర్గాసురేష్, వైరాల చిరంజీవి కొత్త కార్లను కిరాయికి మాట్లాడుకుని డ్రైవర్‌ను హత్య చేసి కార్లను దొంగిలిస్తుంటారు. జూన్ 28న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విశాఖపట్నంలోని సీఎంఆర్ షాపింగ్‌మాల్ సెంటర్ నుంచి మారుతీ కారును రాజమండ్రికి కిరాయికి మాట్లాడుకున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో కారులో రాజమండ్రి శాటిలైట్ సిటీ, రాజీవ్ గృహకల్ప అపార్ట్‌మెంట్ దాటిన తరువాత విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన కారు డ్రైవర్ కర్రి కిరణ్(26)ను కారులోనే కత్తులతో పొడిచి చంపారు.
అనంతరం మృతదేహాన్ని శాటిలైట్ సిటీ శివారు ప్రాంతంలో పడేసి, కారులో మోరంపూడి సెంటర్‌లో ఒక పెట్రోల్ బంక్‌కు వచ్చి అక్కడ సీసాలో పెట్రోల్ తీసుకుని తిరిగి శవం వద్దకు వెళ్లారు. అదే కారులో డ్రైవర్ శవాన్ని బుచ్చియ్యనగర్ రోడ్డులోని గాదాలమ్మ నగర్ గుట్టపై తుప్పల్లో పడేసి, పెట్రోల్ పోసి కాల్చేశారు. కారును అక్కడ నుంచి రంగం పేట మండలం సింగపల్లి గ్రామంలో ఉన్న స్నేహితుడు కొప్పిరెడ్డి అంజి వద్దకు తీసుకెళ్లి విక్రయించమని అప్పగించారు. అంజి కారును ఇంటి వద్ద దాచాడు. ఆ మరుసటి రోజు హత్య గురించి పత్రికల్లో వచ్చిన వార్తను చదివి సురేష్, చిరంజీవి ఇచ్చిన సలహా మేరకు కారులోని ఆడియో సిస్టమ్‌ను, స్టెఫిన్ టైర్, పెన్‌డ్రైవ్‌లను సింగంపల్లి గ్రామానికి చెందిన యర్రంశెట్టి లక్ష్మీనారాయణ(పండు) సహాయంతో తీసివేసి, సూరంపాలెం పుష్కర ఎత్తిపోతల పథకం కాలువ వద్ద కారు వదిలివేశారు. కారులో కారం చల్లి ఆధారం దొరకకుండా జాగ్రత్తపడ్డారు. నిందితుడు బుదిరెడ్డి దుర్గా సురేష్ తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు డబ్బుల కోసం ఈ హత్య చేసిన ట్టు తెలుస్తోంది.
పట్టించిన సీసీ కెమెరా పుటేజ్‌లు
కేసు దర్యాప్తు కోసం కారు కిరాయికి మాట్లాడుకున్న ప్రదేశం విశాఖపట్నం సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు పోలీసులు వెళ్లారు. అదే ప్రాంతంలో ఉన్న స్పెన్సర్ షోరూమ్‌లో నిందితులు కత్తులు, కారం కొనుగోలు చేసినట్టు సీసీ కెమెరా ఫుటేజ్‌ల్లో నమోదైంది. దీంతో నిందితుల ఆచూకీ లభించింది. ధర్మవరం సమీపంలోని టోల్‌గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో కూడా నిందుతుల ఆధారాలు లభించాయి. ఆ ఫొటోల ఆధారంగా మోరంపూడి సెంటర్‌లోని ఒక పెట్రోల్ బంక్ వద్ద 28 రాత్రి పనిచేసిన సిబ్బందిని ఆరా తీయగా వారు నిందితులను గుర్తించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో బొమ్మూరు సీఐ పి.కనకారావుతో పాటు ఎస్సైలు కిషోర్ కుమార్, నాగేశ్వరరావు, ఏఎస్సై శివాజీ సహకరించారు.
వీడిన డ్రైవర్ హత్యకేసు మిస్టరీ
Published Sat, Jul 18 2015 1:21 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement