నెల్లూరు(క్రైమ్): కారుడ్రైవర్ నెల్లూరులోని నగరంలోని ఓ లాడ్జీలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగనాయకులపేట రైలువీధికి చెందిన బాషా, రజియాలు దంపతులు. వారికి అబీద్, నౌషాద్ (33) పిల్లలు. అబీద్ బంగారు పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండగా నౌషాద్ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అబీద్‌కు ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది.
పెళ్లికి ముందు వరకు అన్నదమ్ములిద్దరూ చాలా ఆప్యాయంగా, స్నేహంగా ఉండేవారు. వివాహం తర్వాత అబీద్ వేరే కాపురం పెట్టాడు. అప్పటినుంచి నౌషాద్ మానసికంగా కృంగిపోయాడు. పలుమార్లు తనకు వివాహం చేయమని తల్లిదండ్రులను కోరాడు. అయితే పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి సక్రమంగా వచ్చేవాడు కాదు. పనిచేసుకుని నగరంలోని లాడ్జిలో ఉండేవాడు. రెండు, మూడునెలలకోసారి ఇంటికి వెళ్లేవాడు. నెలరోజులుగా అతను నగరంలోని ఆర్‌ఆర్ లాడ్జీలో రూం నంబర్ 302లో ఉంటున్నాడు.
మూడో అంతస్తుపై నుంచి పడి..
నౌషాద్ సోమవారం రాత్రి ఫూటుగా మద్యం సేవించాడు. 11.30 గంటల సమయంలో రూమ్‌బాయ్‌ని పిలిచి పెరుగన్నం తెప్పించుకుని తిన్నాడు. అనంతరం ఏమైందో కానీ మంగళవారం తెల్లవారుజామున లాడ్జీ మూడో అంతస్తు పైనుంచి బ్రాందీషాప్‌నకు చెందిన స్థలంలో పడ్డాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. లాడ్జి సిబ్బంది గుర్తించి వెంటనే సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. సంతపేట ఎస్సై షేక్ సుభాన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. లాడ్జీ సిబ్బందితో మాట్లాడారు. మూడో అంతస్తు పైభాగంలో మృతుడి సెల్‌ఫోన్, కాలి చెప్పు ఒకటిపడి ఉంది. మృతదేహానికి సమీపంలో మరో చెప్పు పడి ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.
సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద కుప్పకూలిపోయి గుండెలవిసేలా విలపించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. నౌషాద్ ప్రమాదవశాత్తు పడిపోలేదని ఎవరో తోసివేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మద్యం మత్తులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడా? లేదా ఎవరైనా కిందకు తోసివేశారా? ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణాల్లో విచారణను వేగవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment