హరియాణా : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ పెంపుడు కుమార్తె హనీప్రీత్‌ను హరియాణా పోలీసులు బుధవారం పంచకుల కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం.. ఆమెను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. గుర్మిత్‌తో సంబంధాలు, అరెస్ట్ సమయంలో హింస, ఆశ్రమంలో అరాచకాలపై హనీప్రీత్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా కోర్టులో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, విధ్వంసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. గుర్మిత్ తనకు తండ్రిలాంటివారని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని హనీప్రీత్ అన్నారు.
గుర్మీత్ జైలు పాలయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిన హనీప్రీత్‌ను మంగళవారం పంజాబ్‌లోని జిరాక్‌పూర్–పాటియాలా మార్గంలో అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ (బుధవారం) తెల్లవారుజాము మూడు గంటల వరకూ ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో తనకు ఛాతీనొప్పి వస్తున్నట్లు తెలపటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. హనీప్రీత్ పరీక్షలు నిర్వహించి వైద్యులు...ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం హింసాకాండ చెలరేగిన విషయం విదితమే. నిరసనకారులు మీడియా ఓబీ వ్యాన్లను దగ్ధం చేస్తూ, రాళ్లు విసురుతూ.. వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్ల కేసుకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ జాబితాలో హనీప్రీత్ ఇన్సాన్‌ది మొదటి పేరు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment